ఆకాశంలో చికెన్ ధరలు.. కొనాలంటే జేబుకు చిల్లే!

4:05 pm, Mon, 25 May 20

 హైదరాబాద్: చికెన్ తింటే కరోనా వస్తుందన్న వదంతులతో జనం అటువైపు చూడడానికే భయపడ్డారు. ఫలితంగా చికెన్ ధరలు పాతాళానికి పడిపోయాయి. కోళ్ల వ్యాపారులు దారుణంగా నష్టపోయారు. 

కానీ రెండు నెలలు తిరిగేసరికి పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు చికెన్ తినాలని అనుకుంటున్నా ధరలు మాత్రం కొండెక్కి కూర్చున్నాయి. నిజానికి వేసవిలో ఎంతోకొంత తగ్గే చికెన్ ధరలు ఇప్పుడు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. 

 గత రెండు వారాలుగా బోన్ లెస్ చికెన్ ధర కిలో రూ. 400 ఉండగా.. ఈ ఆదివారం నుంచి అది కాస్తా రూ. 500కి చేరింది. దీనితో నాన్ వెజ్ లేకుంటే ముద్ద దిగని వాళ్లకు చికెన్ కొనాలంటే జేబులు చిల్లవుతున్నాయి.

లాక్‌డౌన్ ముందు కిలో చికెన్ కేవలం రూ. 50 మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు రూ. 300 కాస్తా అటూఇటుగా ఉంది.

ఒక్క బోన్ లెస్ చికెన్ మాత్రమే కాదు స్కిన్ లెస్ చికెన్ ధరలకు కూడా రెక్కలొచ్చాయి. విపరీతమైన ఎండలు కారణంగా ఉత్పత్తి పెద్దగా లేకపోవడం, హోటల్స్, రెస్టారెంట్లు మూసి ఉండటంతో చికెన్ సేల్స్ 60 శాతానికి పడిపోయాయి.

అటు మటన్ ధరలు కూడా ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. మొన్నటివరకు కిలో మటన్ రూ. 1000కి విక్రయించారు. అయితే జీహెచ్ఎంసీ అధికారులు అధిక ధరలకు మటన్ అమ్ముతున్న షాపులపై దాడి చేస్తుండడంతో కిలో చికెన్ ధరను రూ. 700 ఫిక్స్ చేశారు.