జనతా కర్ఫ్యూ: రేపు అన్నీ స్వచ్ఛందంగా బంద్ చేయండి.. అవసరమైతే తెలంగాణ షట్‌డౌన్‌: సీఎం కేసీఆర్

cm-kcr-calls-for-24-hours-janata-curfew-in-telangana
- Advertisement -

హైదరాబాద్: కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు, వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో  మొత్తం 21 కరోనా కేసులు నమోదయ్యాయని, వారందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని వెల్లడించారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా అనుమానితులపై నిఘా కోసం తెలంగాణ చుట్టూ 52 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, 78 సంయుక్త కార్యాచరణ బృందాలను కూడా మోహరించామని, ముఖ్యంగా ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని సీఎం వివరించారు.

చదవండి: కరోనా అప్‌డేట్: దేశంలో 258కి పెరిగిన పాజిటివ్ కేసులు, ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులంటే…

ఇప్పటివరకు 11 వేల మంది అనుమానితులను గుర్తించి వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి వివరాలు సరిగా తెలియడంలేదని అన్నారు.  ఆదివారం నాటి ‘జనతా కర్ఫ్యూ’ని ప్రతి ఒక్క పౌరుడు విధిగా పాటించాలని ఆయన పిలుపు నిచ్చారు.

ఇదొక క్లిష్టమైన సమయమని వ్యాఖ్యానించిన కేసీఆర్… అందరూ కలసి కట్టుగా ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని చెప్పారు. షాప్స్, మాల్స్ అన్నీ స్వచ్ఛందంగా మూసివేయాలని కోరారు. ఇది తమ ఆదేశం కాదని… ఎవరికి వారు తమ మనస్సాక్షి మేరకు నిర్ణయం తీసుకుని అన్నిటినీ మూసివేయాలని సూచించారు.

వాటికి అడ్డేం లేదు…

రేపు స్వచ్ఛందంగా అన్నీ మూసివేస్తున్నప్పటికీ ప్రజలకు ఇబ్బందేమీ కలగదని, ఆసుపత్రులు, మెడికల్ షాపులు, ఇతర అత్యవసర సేవలన్నీ అందుబాటులో ఉంటాయని సీఎం చెప్పారు. అలాగే నిత్యావసర వస్తువులు, పాలు, పండ్లు, కాయగూరలు అమ్ముకునే వారి విషయంలో అభ్యంతారాలేమీ ఉండవన్నారు. 

చదవండి: కరోనా భయం: ల్యాండింగ్‌కు ‘నో’.. వెనుదిరిగిన ఫ్లైట్, అందులో 90 మంది భారతీయులు!

పెట్రోల్ బంక్‌లు తెరిచే ఉంటాయని, అలాగే మీడియా సిబ్బందికి కూడా కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. దుకాణాలు, వైన్స్ షాపులు బంద్ చేయాలని ఆదేశించారు. 

ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు బంద్…

తెలంగాణలో రేపు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు నడవవని చెప్పారు. అత్యవసరం కోసం డిపోకు ఐదు ఆర్టీసీ బస్సులు, ఐదు మెట్రో రైళ్లు నడుస్తాయన్నారు. మహారాష్ట్ర బార్డర్ ను మూసివేసే ఆలోచన చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కూడా ఆపేస్తామన్నారు.

14 గంటలు కాదు, 24 గంటలు పాటిద్దాం…

ప్రధాని నరేంద్ర మోడీ రేపు 14 గంటలపాటు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారని, అయితే తెలంగాణ వాసులు రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పాటించి సామాజిక బాధ్యతను చాటాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. 24 గంటలపాటు కర్ఫ్యూ పాటించి యావత్ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలన్నారు.

అవసరమైతే తెలంగాణ షట్‌డౌన్…

ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ కంట్రోల్ అవకుండా అది మరీ విజృంభించే పరిస్థితి వస్తే మాత్రం తెలంగాణ షట్‌డౌన్‌కు కూడా తమ ప్రభుత్వం వెనుకాడబోదని సీఎం చెప్పారు. ప్రతి ఒక్కరినీ వారి ఇళ్లకే పరిమితం చేస్తామని… ప్రభుత్వమే వారికి అవసరమైన నిత్యావసరాలను అందించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

అలాంటి పరిస్థితి రాకూడదనే తాను కోరుకుంటున్నానని వ్యాఖ్యానించిన కేసీఆర్.. కరోనాను కట్టడి చేసేందుకు అవసరమైతే రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా తాము సిద్ధమేనని అన్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌పై చమత్కారంగా మాట్లాడుతూ విలేకరుల సమావేశంలో నవ్వులు కూడా పూయించారు.

చదవండి: కరోనా వైరస్: నా వంతు సేవలు వాడుకోండి.. తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేఏ పాల్ ఆఫర్…

‘‘కరోనా వైరస్‌కు ఆత్మాభిమానం చాలా ఎక్కువ.. దానంతట అది మన ఇంటికి రాదు… దాని దగ్గరకు మనం వెళ్లి, పిలిస్తేనే అది మనింటికి వస్తుంది..’’ అని ఆయన అనడంతో అందరూ నవ్వేశారు.

చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చర్మం ద్వారా కరోనా మన శరీరంలోకి ప్రవేశించదని, కళ్లు, ముక్కు, నోటి ద్వారానే  శరీరంలోకి ఎంటర్ అవుతుందని చెప్పారు.

‘‘క్వారంటైన్ నుంచి పారిపోవడమేంటి?’’

‘‘విదేశాల నుంచి వచ్చిన వారితోనే ఈ తలనొప్పి అంతా..’’ అన్న సీఎం కేసీఆర్.. వారు క్వారంటైన్ నుంచి పారిపోతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘క్వారంటైన్ నుంచి ఎందుకు పారిపోవాలి? విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా వైద్యులకు రిపోర్ట్ చేయాలి.. మీకు కరోనా లక్షణాలు ఉంటేనే ఐసోలేషన్‌కు తరలిస్తారు.. లేకుంటే లేదు..’’ అని వ్యాఖ్యానించారు.  

చదవండి: చైనాలో సంచలనం.. కరోనా వైరస్ నుంచి బయటపడిన వందేళ్ల వృద్ధుడు

విదేశాల నుంచి వచ్చిన వారికి చేతులెత్తి దండం పెడుతున్నానని, దయచేసి ప్రభుత్వానికి సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారి కారణంగా సమాజం మొత్తం వ్యాధిగ్రస్తమయ్యే ప్రమాదం వాటిల్లిందన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో స్వయం నియంత్రణ అవసరమని ఆయన స్పష్టం చేశారు. అలా ముందుకు వచ్చిన వారి కోసం అంబులెన్స్ నుంచి చికిత్సకు అవసరమయ్యే మందుల వరకు అన్నీ ప్రభుత్వమే భరిస్తుందని కేేసీఆర్ హామీ ఇచ్చారు.

- Advertisement -