సినిమా, టీవీ షూటింగులకు సీఎం కేసీఆర్ అనుమతి.. కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి

cm kcr given permission for film and tv shootings
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగ్‌లు నిర్వహించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై ఆయన సోమవారం సంతకం చేశారు.

అయితే సినిమా థియేటర్ల ప్రారంభానికి మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున థియేటర్లను ఇప్పుడే ఓపెన్ చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

- Advertisement -

సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలిసి సినిమా, టీవీ షూటింగ్‌లకు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించుకోవడంతోపాటు, సినిమా థియేటర్లను కూడా తెరువడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.

దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం.. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

దీంతో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఇతర సినీ రంగ ప్రముఖులు సమావేశమై ఒక ముసాయిదాను రూపొందించారు.

ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పరిమిత సిబ్బందితో షూటింగ్‌ జరుపుకొంటామని సినీ ప్రముఖులు హామీ ఇవ్వడంతో. ఈ మేరకు షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు అనుమతి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

సినిమా, టీవీ షూటింగులు కూడా పరిమిత సిబ్బందితో, కొవిడ్‌-19కు సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలను, లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ నిర్వహించుకోవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

అలాగే ఇప్పటికే షూటింగ్‌లు పూర్తయిన సినిమాలు, టీవీ సీరియళ్ల పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా నిర్వహించుకోవచ్చునని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి…

రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగ్‌లకు అనుమతి మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.

వేల మంది దినసరి వేతన కార్మికుల బతుకుతెరువును దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు.

అలాగే దీనికి సంబంధించిన విధి విధానాలు వెంటనే రూపొందించి, సహకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు, ఇతర ప్రభుత్వాధికారులకు ధన్యవాదాలు తెలియస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు చిరంజీవి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

 

- Advertisement -