కన్నీటి సంద్రం మధ్య కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు పూర్తి

- Advertisement -

సూర్యాపేట: గాల్వన్‌లో భారత్ – చైనా భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు కేసారంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు ఆర్మీ అధికారులు నిర్వహించారు. సైనిక సంస్కారంలో భాగంగా 16వ బీహార్ రెజిమెంట్ పాల్గొంది. ఆర్మీలో సంతోష్ అందించిన సేవలకు గుర్తుగా యూనిఫామ్, అతడి టోపీని అధికారులు ఆయన భార్య సంతోషికి అందించారు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం సంతోష్ తండ్రి ఉపేందర్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన వెంట సంతోష్ భార్య సంతోషితో పాటు కుమారుడు ఉన్నారు. కుమారుడితో చితికి నిప్పు అంటించారు. కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అంత్యక్రియలకు అనుమతించారు.
అంతకుముందు సంతోష్ అంతిమయాత్రను అతని నివాసం నుంచి కేసారంలోని వ్యవసాయ క్షేత్రం వరకు దాదాపు 5.5 కిలోమీటర్ల మేర సాగింది. మిలటరీ వాహనంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచి సైనిక సిబ్బంది ముందు వరుసలో కవాతు చేస్తూ అంతిమయాత్ర నిర్వహించారు.

సూర్యాపేట పట్టణంలోని ఎంజీ రోడ్డు, శంకర్ విలాస్ సెంటర్, రైతు బజార్, పాత బస్టాండ్, కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా కేసారంలోని వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమ యాత్ర సాగింది. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నివాళులు అర్పించారు. ప్రజలు భవనాలపై నుంచి పూలు చల్లుతూ, జాతీయ జెండాలు పట్టుకుని సంఘీభావం ప్రకటించారు. సూర్యా పేట పట్టణంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌‌ను పాటించారు.

- Advertisement -
- Advertisement -