భారత్-చైనా సరిహద్దులో ఘర్షణ.. అమరుడైన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్‌బాబు

- Advertisement -

న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో ఈ రోజు జరిగిన ఘర్షణలో ముగ్గురు భారత సైనికులు అమరులయ్యారు. వీరిలో ఒకరు తెలంగాణలోని సూర్యాపేట వాసి క‌ల్న‌ల్ బిక్కుమల్ల సంతోష్‌బాబు ఉన్నారు.

సంతోష్‌బాబు అమరుడైన విషయాన్ని అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు అందించారు. ఏడాదిన్నర కాలంగా సంతోష్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్‌ ఉన్నారు.

సంతోష్ తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకు‌లో మేనేజర్‌గా పనిచేసి రిటైరయ్యారు. సంతోష్‌ కోరుకొండ సైనిక్ స్కూలులో చదువుకున్నారు.

మూడు నెలల క్రితమే సంతోష్‌ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. అయితే, లాక్‌డౌన్‌ కారణంగా ఆయన చైనా సరిహద్దులోనే ఉండిపోయారు. సంతోష్‌ మరణ వార్త ఆయన కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది.

లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద సరిహద్దుల్లో భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ మరింత పెరిగింది.

ఈ క్రమంలో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్‌ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో గాల్వన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

- Advertisement -