‘మహాకూటమి’కి కాంగ్రెస్ మార్కు వెన్నుపోటు!? అర్ధరాత్రి వేళ అభ్యర్థుల జాబితా ప్రకటనపై మిత్రపక్షాలు గరం.. గరం

12:03 pm, Tue, 13 November 18
maha-kutami-congress-mark-politics

telangana-mahakutami-leaders

హైదరాబాద్: తెలంగాణలో టిఆర్ఎస్ కుటుంబ పాలనకు చరమగీతం పాడడమే మా లక్ష్యం, ఈ లక్ష్య సాధనలో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటామంటూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘మహాకూటమి’ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన మిత్రధర్మానికి తూట్లు పొడిచిందా?

సీట్ల కేటాయింపులో విపరీత జాప్యం చేసిన కాంగ్రెస్.. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటూ.. మరోవైపు ఆర్థరాత్రి వేళ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి.. మహాకూటమిలోని మిత్ర పక్షాలైన టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు కాంగ్రెస్ మార్కు వెన్నుపోటు పొడిచిందా? ఈ ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకులు అవును అనే సమాధానమే చెబుతున్నారు.

తెలంగాణలో తెలుగుదేశం, సీపీఐ , టీజేఎస్‌లతో కలిసి కూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. సీట్ల సర్దుబాటు కంటే లక్ష్యమే ముఖ్యమంటూ ప్రగల్భాలు పలికింది. కానీ తీరా సీట్ల జాబితా విడుదల చేసేసరికి, కాంగ్రెస్ మార్కు రాజకీయం బయటపడిందని, మిత్ర ధర్మం పాటించకుండా కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను రూపొందించిందని అంటున్నారు.

మిత్రపక్షాలు అడిగిన స్థానాల్లో కూడా…

ఇన్నాళ్లూ సీట్లు, అభ్యర్థులు, అసమ్మతి, బుజ్జగింపులు అంటూ రోజుల తరబడి చర్చించిన కాంగ్రెస్ అధిష్ఠానం సోమవారం అర్థరాత్రి ప్రాంతంలో 65 మంది అభ్యర్థులతో కూడిన తమ పార్టీ తొలివిడత జాబితాను విడుదల చేసింది.

తెలంగాణలో కాంగ్రెస్ బలం ఎక్కువగా ఉందని, కాంగ్రెస్‌తో కలిసి పోరాడితేనే నయం అని భావించిన సీపీఐ, టీజేఎస్ పార్టీలకు కాంగ్రెస్ మొండి చేయి చూపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచిత్రం ఏమిటంటే.. ఆ పార్టీలు కోరుతున్న స్థానాలలో సైతం కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించేసింది. రామగుండం, స్టేషన్ ఘనపూర్, ఆసిఫాబాద్ స్థానాలను సీపీఐ కోరింది. అయితే ఈ స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించింది.

ఇంటి పార్టీకీ మొండిచేయి…

అలాగే ఇంటి పార్టీ విషయంలో కూడా. మహాకూటమిలో ఇంటి పార్టీ భాగస్వామ్యం అయిన తర్వాత అడిగినది ఒకే ఒక్క సీటు. అది కూడా నకిరేకల్ సీటు.  ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ నకిరేకల్ స్థానం నుంచి తన భార్యను పోటీ చేయించాలని భావించారు.  అయితే కాంగ్రెస్ ఇక్కడ కూడా తన మార్కు రాజకీయం ప్రదర్శించింది. ఇంటి పార్టీకి ఆ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు.

మిత్రపక్షాలు గరం గరం…

మహాకూటమి అంటూ దాదాపు నెలన్నరకుపైగా కాలయాపన చేసిన కాంగ్రెస్ పార్టీ.. చివరకు సీట్ల వద్దకు వచ్చేసరికి, మిత్ర ధర్మాన్ని పక్కన పెట్టి మిత్రపక్షాలు కోరిన స్థానాల్లోనూ తమ అభ్యర్థులను ప్రకటించడంపై సీపీఐ, టీజేఎస్, ఇంటిపార్టీ గరం గరం అవుతున్నాయి. ఈ మేరకు మిత్ర పక్షాల నుండి తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

ఇప్పటికే ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ‘‘గెలిచే సీట్లను వదులుకోవడమేనా త్యాగం చేయడమంటే..?’’ అని ఆయన ప్రశ్నిస్తున్నారు.  ఏది ఏమైనా, అర్ధరాత్రి వేళ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత మహాకూటమిలోని మిత్ర పక్షాలు కంగుతిన్న మాట వాస్తవం.