15 నుంచి తెలంగాణ జిల్లాల్లో తెరుచుకోనున్న కోర్టులు.. హైకోర్టు ఉత్తర్వులు జారీ

courts-in-districts-should-be-reopen-in-a-phased-manner-from-June15-says-ts-high-court
- Advertisement -

హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇన్నాళ్లూ రాష్ట్ర వ్యాప్తంగా మూతపడి ఉన్న అన్ని కోర్టులు ఈ నెల 15 నుంచి తిరిగి పని చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే 28 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టు, నాంపల్లి క్రిమినల్‌ కోర్టులు, సిటీ స్మాల్‌కాజెస్‌ కోర్టు, సీబీఐ కోర్టు, రంగారెడ్డి జిల్లాలో ప్రధాన కోర్టులు మాత్రం మూసి ఉంటాయని పేర్కొంది.

- Advertisement -

కరోనా నేపథ్యంలో జిల్లా జడ్జీలు సహా పలువురి నుంచి అందిన సూచనల మేరకు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

జిల్లాల్లోని కింది కోర్టులు, ట్రైబ్యునళ్లు, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ, ఆర్బిట్రేషన్‌ కేంద్రం, రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీలకు ప్రకటించిన లాక్‌డౌన్‌ను క్రమంగా సడలించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది.

ఈ నెల 15 నుంచి 30 వరకు తొలి విడత, జులై 1 నుంచి 15 వరకు రెండో విడత, 16 నుంచి ఆగస్టు 7 వరకు మూడో విడత, ఆగస్టు 8 నుంచి మరో విడతగా కోర్టులను విభజించింది.

తొలి విడతలో 20 కేసులు, రెండో విడతలో 40, మూడో విడతలో 60 కేసుల వరకు జడ్జిలు విచారణ చేయవచ్చని తెలిపిన హైకోర్టు.. ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని సూచించింది. 

కోర్టులో పాటించాల్సిన నిబంధనలు…

* ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటలకు కోర్టు ఆవరణను క్రిమిరహితంగా శుభ్రం చేయాలి.
* ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. మాస్కులు లేని వారిని కోర్టు ప్రాంగణంలోకి అనుమతించకూడదు.
* కోర్టు ప్రాంగణంలో కరోనా నిబంధనలపై సూచనలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలి.
* ప్రవేశం వద్ద న్యాయాధికారితో సహా అందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాలి. కోర్టులో అందుబాటు ప్రాంతాల్లో శానిటైజర్లు ఉంచాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత దూరం పాటించాలి.
* దగ్గు, జ్వరం తదితర లక్షణాలున్న వారిని కోర్టు ప్రాంగణంలోకి అనుమతించరు. ఎవరికైనా అలాంటి లక్షణాలుంటే వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి నోడల్‌ అధికారికి సమాచారం అందించాలి.
* కోర్టు ఆవరణ శుభ్రతలో జిల్లా జడ్జి నియమించిన నోడల్‌ అధికారి బాధ్యత వహించాలి.
* తాజా ఫైలింగ్‌, దరఖాస్తులు, కోర్టు ఫీ చెల్లింపులు తదితరాలకు కోర్టు ప్రవేశ ద్వారం సమీపంలో ఓ పక్కన విభాగం ఏర్పాటు చేయాలి. తద్వారా కోర్టు ఆవరణల్లో రద్దీ తగ్గుతుంది. పరిశీలన అయ్యాక కక్షిదారుల ఫోన్‌లకు మెసేజ్‌ల రూపంలో సమాచారం అందించాలి.
* కేసుల జాబితా ప్రకారం వెళ్లడానికి వీలుగా న్యాయవాదులకు వెయిటింగ్‌ హాలు ఏర్పాటు చేయాలి. అందులో కేసుల వివరాలను తెలిపే డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలి. కుర్చీల మధ్య 3 అడుగుల దూరం ఉండాలి.
* జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, కోర్టు మేనేజర్‌, న్యాయవాదులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి ఈ-ఫైలింగ్‌, వీడియో కాన్ఫరెన్స్‌ విధానం, సాక్షుల వాంగ్మూలం నమోదుపై అవకాశాలను పరిశీలించాలి.
* విచారణకు హాజరు కాలేమని పార్టీలు విజ్ఞప్తి చేసినపుడు న్యాయాధికారులు కఠినంగా వ్యవహరించకూడదు. వారెంట్లు జారీ చేయడం వంటివి చేయకూడదు. ఒక పక్షం రాలేని పక్షంలో మరో పక్షం వాదనలు విని ఉత్తర్వులు జారీ చేయకూడదు.
* పోలీసు, జిల్లా వైద్యాధికారులు, బార్‌ అసోసియేషన్‌తో సమావేశాలు నిర్వహించి కోర్టులోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు హైకోర్టుకు నివేదిక పంపాలి. 

- Advertisement -