వదంతులు నమ్మొద్దు.. కరోనా అలా రాదు: హెల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్

7:51 pm, Wed, 4 March 20

హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ హైదరాబాద్‌లో కూడా కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్‌పై సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ వివరణ ఇచ్చారు. కరోనాకు సంబంధించి వ్యాధి వ్యాప్తి, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురిచి ఆయన వివరించారు.

కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి కాదని స్పష్టం చేశారు. కరోనాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారనీ, వారిలో కేవలం మూడు శాతం మంది మాత్రమే మృత్యువాత పడ్డారనీ, ఐదు శాతం మందిలో మాత్రమే వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. కరోనా వైరస్‌తో మరణాల శాతం చాలా తక్కువగా ఉందన్నారు.

వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తి తుమ్మినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ అరచేతితో, లేదంటే చేతిగుడ్డతో మూసుకోవాలని సూచించారు. వ్యాధికి గురైన వ్యక్తి తుమ్మినపుడు కనీసం 2 మీటర్ల దూరం ఉంటేనే అది సోకే అవకాశం ఉంటుందనీ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు మాత్రమే అది వ్యాపిస్తుందని వివరించారు. పలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారిని తరిమేయొచ్చని డాక్టర్ శ్రీనివాస్‌ వివరించారు.

గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న కరోనా బారిన పడిన వ్యక్తి కోలుకుంటున్నారని ఆయన తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి కలిసిన అందరికీ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా వైరస్‌ నివారణకు సరైన వైద్య చికిత్సలు లేవని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

కరోనా సోకిన వ్యక్తి.. కలిసిన 45 మంది నమూనాలు నెగటివ్‌ వచ్చినట్లు ఆయన తెలిపారు. మరో ఇద్దరి నమూనాల ఫలితాలు పూణెలోని నేషనల్‌ వైరాలజీకి పంపించినట్టు పేర్కొన్నారు.

చదవండి: షాకింగ్: తెలంగాణలో ‘కరోనా’ కలకలం.. దేశంలో మొత్తం 5 కేసులు