హైదరాబాద్ మెట్రో రైలులో తాగుబోతు వీరంగం

12:48 pm, Sat, 14 September 19

హైదరాబాద్: మెట్రో రైలులో ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. ఓ తాగుబోతు హల్ చల్ చేశాడు. తోటి ప్రయాణికులకు చుక్కలు చూపించాడు.

అరుపులు, కేకలు, డ్యాన్సులు, వింత చేష్టలు, అనుచిత ప్రవర్తనతో మహిళా ప్రయాణికులను బెంబేలెత్తించాడు. తన ప్రవర్తనతో తోటి ప్రయాణికులను బాగా ఇబ్బంది పెట్టాడు.

న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. ఫూటుగా మద్యం సేవించి మెట్రో రైలు ఎక్కిన ఓ తాగుబోతు రచ్చ చేశాడు. సికింద్రాబాద్‌ నుంచి తార్నాక వెళ్తున్న మెట్రోరైలులో ఈ ఘటన జరిగింది.

మద్యం మత్తులో ఉన్న మందుబాబు సెల్‌ఫోన్‌లో ఫుల్ సౌండ్ తో పాటలు పెట్టాడు. ఆ తర్వాత గట్టిగా అరుస్తూ డాన్స్ చేశాడు. దీంతో తోటి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

పసిపిల్లలు భయపడ్డారు. అంతేకాదు డోర్ దగ్గర నిలబడి వింత చేష్టలతో అందరిని హడలెత్తించాడు. తాగుబోతు చేష్టలతో హడలిపోయిన ప్రయాణికులు వాడికి దూరంగా వెళ్లి కూర్చున్నారు.

తాగుబోతు వీరంగాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. కాగా, తాగుబోతుని మెట్రో రైలులోకి అనుమతించడంతో సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికుల ఫిర్యాదు మేరకు సిబ్బంది మందుబాబును తార్నాక స్టేషన్‌లో దించేశారు. తాగుబోతు వీరంగాన్ని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మందుబాబుని గుర్తించే పనిలో ఉన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. సెప్టెంబర్ 8న ఈ ఘటన జరిగిందని చెప్పారు.

ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో రిపీట్ అవ్వకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సెక్యూరిటీని మరింత పెంచుతామన్నారు. కాగా కొంత మొత్తంలో మద్యం తాగినవారిని మెట్రో రైలు ఎక్కేందుకు అనుమతించాలని తనకు చాలా రిక్వెస్టులు వచ్చాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

మద్యం సేవించి ఉన్న కారణంగా డ్రైవింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు తమను పట్టుకుంటారని, అందుకే మెట్రో రైల్లో జర్నీకి అనుమతి ఇవ్వాలని చాలామంది కోరారని వెల్లడించారు.

అందుకే తాము మద్యం తాగినా మెట్రో రైల్లో జర్నీకి అనుమతిస్తామని చెప్పారు. ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదన్నారు.

మెట్రో ప్రయాణికులు తమ ఫిర్యాదులు, సమస్యలు తెలిపేందుకు అప్లికేషన్ తీసుకొస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 10 రోజుల్లో దీన్ని అమల్లోకి తెస్తామన్నారు.

ప్రయాణికుల ఫిర్యాదులను తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా చూస్తామన్నారు. అలాగే ప్రయాణికుల కోసం వాట్సాప్ సౌకర్యం కూడా తీసుకొస్తామన్నారు. దాని ద్వారా స్పాట్ లోనే సమస్యని పరిష్కరించే సౌలభ్యం ఉంటుందన్నారు.