దూకుడు పెంచిన కేసీఆర్, నవంబర్‌లోనే ఎన్నికలు, 105 మందితో టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా!

cm-kcr
- Advertisement -

cm-kcr

హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు నవంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయని, డిసెంబర్‌లో ఫలితాలు వెలువడతాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. గురువారం అసెంబ్లీ రద్దు అనంతరం  తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.

- Advertisement -

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని కేసీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ 100కుపైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ 100 స్థానాల్లో 50 శాతానికిపైగా ఓట్లను సాధిస్తామని, వీటిలో 82 నియోజకవర్గాల్లో అయితే 60 శాతానికి పైగా ఓట్లు వస్తాయని ఘంటా పథంగా చెప్పారు.

రేపట్నించే ఎన్నికల ప్రచారం…

రేపు శుక్రవారం చాలా మంచి రోజని, రేపట్నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నామని కేసీఆర్ తెలిపారు. 50 రోజుల్లో 100 సభలను నిర్వహిస్తామని, కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ మంచి కోసమే చేస్తాడని చెప్పారు. కె.కేశవరావు అధ్యక్షతన త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తామని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను తిరిగి గెలిపించుకుని.. ప్రజలంతా చల్లగా బతకాలని ఆయన పిలుపునిచ్చారు.

కేసీఆర్ సంచలన ప్రకటన…

ఊహించని విధంగా అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ మరో ఊహించని అడుగు వేశారు. ప్రతిపక్షాలు సైతం విస్మయం చెందేలా ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. 105 మందితో టీఆర్ఎస్ ఎమ్యెల్యే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిస్తున్నామన్నారు.

ఆందోల్, చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వడం లేదని.. అలాగే  మేడ్చల్, మల్కాజ్ గిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ స్థానాలను పెండింగ్ లో ఉంచామని చెప్పారు. మిగిలిన అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వారి సీట్లను వారికే కేటాయించడం జరిగిందని చెప్పారు.

15 సర్వేల ఆధారంగా టీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సిట్టింగ్ లను మార్చబోమని గతంలోనే చెప్పానని, చెప్పినట్టుగానే అందరికీ సీట్లను ఇస్తున్నామని, కొన్ని చోట్ల చిన్నచిన్న సమస్యల కారణంగా కొందరికి తొలి జాబితాలో సీట్లను కేటాయించలేకపోయామని పేర్కొన్నారు.

 

- Advertisement -