మాజీ భార్యకు అప్పటి ఫొటోలు పంపి చిత్రహింసలు పెడుతున్న మాజీ భర్త

12:08 pm, Fri, 28 February 20

హైదరాబాద్: మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకోబోతున్న మహిళకు మాజీ భర్త నిత్యం నరకం చూపిస్తున్నాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను ఆమె ఫోన్‌కు పంపి వేధించడం మొదలుపెట్టాడు.

వెల్లువలా వచ్చిపడుతున్న ఫొటోలను చూసి విస్తుపోయిన బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. సినిమాల్లో స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న యువకుడికి 11 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే, పెళ్లైన కొన్ని నెలలకే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి.

విషయం తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు రాజీ కుదిర్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకే మళ్లీ అతడిలోని మృగాడు నిద్రలేచి చిత్రహింసలు మొదలుపెట్టాడు. భరించలేని బాధిత మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. నాలుగేళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుంది.

భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న కుమార్తెకు మరో వివాహం చేయాలని నిర్ణయించిన తల్లిదండ్రులు ఇటీవల ఓ యువకుడితో నిశ్చితార్థం చేసుకున్నారు.

విషయం తెలుసుకున్న మాజీ భర్త మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు. పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తానంటూ ఏకాంత చిత్రాలను పంపడం మొదలుపెట్టాడు.

అంతేకాదు, ఆమె కాబోయే భర్త ఫోన్ నంబరు సంపాదించి అతడికీ పంపడం మొదలుపెట్టాడు. అతడు ఆమెకు విషయం చెప్పాడు. దీంతో అతడి అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.