మాజీ మంత్రి హరీష్ కు తప్పిన పెనుప్రమాదం!

8:58 am, Sat, 30 March 19
harishrao

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ లో శుక్రవారం రాత్రి జరిగిన ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ ప్రసంగిస్తుండగా ప్రచార రథంలో మంటలు చెలరేగాయి. జనరేటర్ లో పొగలు వ్యాపించి డీజిల్ లీకేజీ కావడంతో మంటలు వ్యాపించాయి.

ప్రమాదానికి రెండు నిమిషాల ముందు ప్రచార రథానికి సంబంధించిన విద్యుత్తు లైట్లు నిలిచిపోయాయి. డీజిల్‌ అయిపోవడంతో అలా జరిగిందని అంతా భావించారు. హరీశ్‌రావు ప్రసంగం ముగిసే దశకు చేరుకుంటుండగా వాహనం వెనుక భాగంలో ఒక్కసారిగా పొగలు వ్యాపించి, మంటలు రేగాయి.

పొగలు అధికం కావడంతో ప్రచార రథంపై ముందు భాగంలో ఉన్న హరీశ్‌రావు, మెదక్‌ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలు వాహనం దిగి దూరంగా వెళ్లారు. స్థానికులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంటలు ఆర్పివేశారు. టీఆర్ఎస్ ప్రముఖ నాయకులకు ప్రమాదం తప్పడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.