సార్వత్రిక ఎన్నికలు 2019: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న తొలిదశ పోలింగ్…

11:23 am, Thu, 11 April 19
general-elections-2019-voters-at-a-poling-station-in-ap

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 లోక్‌సభ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ ప్రారంభమైంది. వీటితోపాటే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అన్ని అసెంబ్లీ స్థానాలకు, ఓడిశాలో 28 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది.

తెలంగాణలో 17ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలు, అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

వేసవికాలం కావడంతో ఉష్ణోగ్రతలు పెరగక ముందే తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉత్సాహంతో ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుదీరుతున్నారు.

కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఆలస్యంగా…

ఉదయం ఈవీఎంలు మొరాయించడంతో కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణలో సాయంత్రం ఐదు గంటల వరకు, ఆంధ్రప్రదేశ్‌లో ఆరు గంటల వరకు క్యూలో నిల్చున్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం లభించనుంది.

మాక్ పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, వీవీప్యాట్లు పనిచేయకపోవడంతో అధికారులు వాటిని సరిచేస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల పోలింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ఈ ఎన్నికల్లో అరుణాచల్‌ప్రదేశ్(వెస్ట్)లో మాజీ ముఖ్యమంత్రి నంబుతుకి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు పోటీ పడుతున్నారు. అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ కాలియాబోర్ నుంచి బరిలో ఉన్నారు.

తేజ్‌పూర్ నుంచి తెలుగు వాడైన మాజీ ఐఏఎస్ ఎంజీవీకే భాను పోటీలో ఉన్నారు. బిహార్‌లో తొలిదశలో నాలుగు స్థానాలకు, జమ్మూకశ్మీర్‌లో ఆరు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బరిలో ఉన్న నాగ్‌పూర్‌లోనూ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.