కేసీఆర్ నమ్మకద్రోహం: టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ వివేక్ గుడ్‌బై

3:58 pm, Mon, 25 March 19
Telangana Latest Political News, TRS Latest News, KCR News, Newsxpressonline

హైదరాబాద్: పెద్దపల్లి లోక్‌సభ టికెట్ తనకు కేటాయించకపోవడంతో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు మాజీ ఎంపీ గడ్డం వివేక్. సోమవారం తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు. తనకు ఎంపీ టికెట్ ఇవ్వనందుకు ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన ఆయన.. సోమవారం అధికారికంగా ఆ పార్టీని వీడారు.

కేసీఆర్ తనను నమ్మించి గొంతుకోశారని, కేసీఆర్ నమ్మకద్రోహం వల్లే తనకు టికెట్ రాలేదని వివేక్ విమర్శించారు. తనకు టికెట్ ఇవ్వకుండా ఉండేందుకే చివరి వరకూ అభ్యర్థులను ప్రకటించలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చినా.. ప్రోటోకాల్ మాత్రం పాటించలేదని మండిపడ్డారు.

ఉద్యమకారులకు అవమనాలే..

తెలంగాణ ఉద్యమకారులకు టీఆర్ఎస్‌లో అవమానాలే జరుగుతాయని వివేక్ విమర్శించారు. కాగా, టీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో వివేక్.. బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ఆయన పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సోమవారం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ కుంతియా.. వివేక్‌తో సంప్రదింపులు జరిపినా ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. కాగా, గత ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వివేక్.. ఆ తర్వాత మళ్లీ గులాబీ గూటికి చేరారు.

చదవండి: చిరు వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ వరాల జల్లు