హైదరాబాద్‌లో భారీ వర్షం.. పాతబస్తీ సహా పలు ప్రాంతాలు జలమయం!

6:43 pm, Sat, 20 April 19
Heavy Rain in Hyderabad

హైదరాబాద్‌: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడగా, మరికొన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.

తార్నాక, ఓయూ క్యాంపస్‌, నాచారం, ఉప్పల్, చార్మినార్, ఎల్బీనగర్, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌, అంబర్‌పేట, అమీర్‌పేట్, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. శివారు ప్రాంతాల్లో కూడా భారీగానే పడింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటూ వడగళ్లు కూడా పడ్డాయి.

పాతబస్తీ జలమయం…

ఈ అకాల వర్షానికి హైదరాబాద్ పాతబస్తీ జలమయమైంది. వర్షపు నీటి దెబ్బకు డ్రైనేజీలు పొంగిపొర్లడంతో మురుగునీళ్లు రోడ్లపైకి చేరాయి. దీంతో స్థానికులు, వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు.

వీకెండ్ కావడంతో శనివారం నగరంలోని రోడ్లు రద్దీగా మారాయి. ఉన్నట్లుండి వర్షం కురవడంతో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో వాహనాలను క్రమబద్దీకరించలేక ట్రాఫిక్ పోలీసులు నానా అవస్థలు పడ్డారు.