సంచలనం: హీరా గోల్డ్‌ భారీ కుంభకోణం.. సంస్థ ఛైర్మన్‌ నౌహీరా బేగం అరెస్ట్

Heera gold
- Advertisement -

heera gold1

హైదరాబాద్: జనానికి అధిక వడ్డీని ఆశ చూపించి వేల కోట్ల రూపాయలు దోచేసిన మరో సంస్థ భాగోతాన్ని పోలీసులు తాజాగా బయటపెట్టారు. చిట్టీలు, ఎక్కువ వడ్డీ చెల్లిస్తామంటూ జనాలను మభ్యపెట్టి దేశవ్యాప్తంగా మోసానికి పాల్పడిన హీరా గోల్డ్ సంస్థ ఛైర్మన్‌ షేక్‌ అలీమియా నౌహీరా బేగంను మంగళవారం హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

ఆరు సంవత్సరాల కిందట హైదరాబాద్‌లోని ఆ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పోలీసుల నుండి తప్పించుకు తిరుగుతున్న నౌహీరా బేగంను తాజాగా సీసీఎస్ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు తరలించారు.

16 కంపెనీలు, 160 బ్యాంకు ఖాతాలు…

దేశవ్యాప్తంగా వందల కోట్లు డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించని హీరా గోల్డ్ సంస్థపై హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, ముంబైలతో పాటు పలు రాష్ట్రాల్లో చాలా కేసులు నమోదయ్యాయి. దాదాపు 16 కంపెనీల పేరుతో డిపాజిట్లు సేకరించి, భారీ మోసానికి పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు..  దేశవ్యాప్తంగా 160 బ్యాంకు ఖాతాల ద్వారా ఈ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు.

ఈ క్రమంలో తెలంగాణ డిపాజిట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం 1999లోని సెక్షన్ 406, 409, 420, 506 కింద పలు కేసులు నమోదు చేశారు. తొలిసారిగా 2012లో హీరా గోల్డ్‌పై కేసు నమోదైంది.

పార్టీ పెట్టి మరీ..

రాజకీయాల్లోకి వచ్చి.. ఆల్ ఇండియా మహిళా సాధికారికత పార్టీ పేరుతో ఒక రాజకీయ పార్టీని ప్రారంభించిన నౌహీరా.. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో పలువురికి టిక్కెట్లు ఇస్తానని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది.

నిందితురాలిపై కర్ణాటకలో కూడా పలు కేసులు నమోదయ్యాయని… కర్ణాటక పోలీసులతో కూడా కలిసి ఈ కేసును దర్యాప్తు చేస్తామని తెలంగాణ పోలీసులు వెల్లడించారు. అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని హీరా ఇస్లామిక్ సంస్థలోనూ సీసీఎస్ పోలీసులు, సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

తిరుపతిలోనూ…

హీరా గోల్డ్ అక్రమాలు తిరుపతిలో కూడా వెలుగులోకి వచ్చాయి. తిరుపతి టౌన్‌లో హైటెక్ మత సంస్థను హీరా కంపెనీ నిర్వహించింది. డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించలేదు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు హీరా గోల్డ్ డిపాజిట్లపై ఆరా తీస్తున్నారు. హవాలా ద్వారా కూడా సంస్థకు డిపాజిట్లు వచ్చినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -