దారుణ హత్య: పట్టపగలే, భార్య పక్కనుండగానే భర్తపై దాడి.., ప్రేమ వివాహమే కారణమా?

pranai-murder
- Advertisement -

నల్గొండ : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే జ్యోతి హాస్పటల్ సమీపంలో పట్టపగలే ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు.  హతుడ్ని మిర్యాలగూడలోని వినోభానగర్‌కు చెందిన పెరుమాళ్ల ప్రణయ్‌(24)గా గుర్తించారు.  స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రణయ్‌కు 6 నెలల క్రితం  అమృత వర్షిణి(23) అనే యువతితో వివాహం జరిగింది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నట్లు తెలుస్తోంది.

భార్య అమృత వర్షిణి గర్భవతి కావడంతో స్థానిక గైనకాలజిస్టు దగ్గర చెక్‌అప్‌ కోసం ప్రణయ్ శుక్రవారం తీసుకువచ్చాడు. డాక్టర్‌కు చూపించిన అనంతరం తిరిగి ఆమెను ఇంటికి తీసుకెళుతున్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి వెనకవైపు నుంచి వచ్చి కత్తితో ప్రణయ్‌పై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ప్రణయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. భర్తను తన కళ్లెదుటే దారుణంగా నరికి చంపటంతో అమృత వర్షిణి షాక్‌కు గురైంది. అంతేకాదు, ఈ దాడి ఘటనంతా ఆ ప్రాంతంలో అమర్చి  ఉన్న సీసీ టీవీ కెమెరాలలో రికార్డయింది.

- Advertisement -

ప్రేమ వివాహమే దాడికి కారణమా?

అమృత వర్షిణి తండ్రి మారుతీరావు మిర్యాలగూడలో పేరుమోసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. అమృత, ప్రణయ్‌‌ల ప్రేమవివాహం మారుతీరావు కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది, అయినా సరే అమృత పెద్దలను ఎదిరించి ఆర్నెల్ల క్రితం ప్రణయ్‌ను వివాహం చేసుకుంది. ఇటీవలే వారు రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా జరుపుకున్నారు.

మృతుడి కుటుంబీకుల ఆందోళన…

ఈ నేపథ్యంలో ప్రణయ్‌ది హత్య అని,  ప్రేమ వివాహం చేసుకోవడం వల్లే అతడ్ని మట్టుబెట్టారంటూ మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. జిల్లా ఎస్పీ రంగనాథ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారని,  త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.

 

- Advertisement -