టీడీపీ ‘సేవామిత్ర’లో తెలంగాణ సమాచారం ఎలా?: వదిలే సమస్యే లేదన్న స్టీఫెన్ రవీంద్ర…

- Advertisement -

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న డేటా చోరీ కేసులో మరో కీలక మలుపు తిరిగింది. తెలుగుదేశం పార్టీ కోసం ఐటీ గ్రిడ్స్ సంస్థ రూపొందించిన ‘సేవామిత్ర’ యాప్‌లో ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారంతోపాటు తెలంగాణ ప్రజల సమాచారం కూడా ఉన్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు.

ఈ డేటాతో ఏం చేసివుంటారన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధిపతి, పశ్చిమ మండలం ఐజీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.  అంతేకాదు, డేటా చోరీ కేసుతో సంబంధం ఉన్న ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

ప్రజల వ్యక్తిగత సమాచారం చౌర్యానికి సంబంధించిన కేసులు దర్యాప్తు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేసు పూర్వాపరాలు వివరించేందుకు గురువారం డీజీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో సిట్‌ ఇంఛార్జ్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడారు.

తెలంగాణ సమాచారంతో ఏం చేశారు?: ఎవరినీ వదిలిపెట్టం..

డేటా చౌర్యానికి సంబంధించి ఐటీ గ్రిడ్స్‌, బ్లూఫ్రాగ్‌ సంస్థలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని, గురువారం నుంచి వీటిని తాము దర్యాప్తు చేస్తున్నామని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ పౌరులకు సంబంధించి డేటా ఉంటే తెలంగాణ పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తారని టీడీపీ నాయకులు లేవనెత్తుతున్న ప్రశ్నలను ఈ సందర్భంగా విలేకరులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో ఈ విషయంపై మాట్లాడుతూ.. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ నిర్వహిస్తున్న ‘సేవామిత్ర’ యాప్‌లో తెలంగాణ పౌరుల వ్యక్తిగత సమాచారం కూడా ఉన్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ సమాచారం వీరికి ఎలా వచ్చింది? దాంతో ఏం చేశారు? అనే విషయాలపైనా సిట్ ఆరా తీస్తున్నట్లు తెలిపారు.

ఈ కేసులో ఇంకా ఎవరికైనా నోటీసులిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. దోషులు ఎంత పెద్దవారయినా వదిలే ప్రసక్తే లేదని, చట్టబద్ధంగానే వారిపై చర్యలు తీసుకుంటామని రవీంద్ర చెప్పారు. నిందితుడిగా గుర్తించిన అశోక్‌ అమరావతిలో ఉన్నా, అమెరికాలో ఉన్న తప్పకుండా తీసుకొస్తామని, చట్టం ముందు నిలబెడతామన్నారు.

టీడీపీ సమాచారం వైసీపీకి ఇచ్చారనే ఆరోపణలపై…

మార్చి 2న కేసు నమోదైతే ఫిబ్రవరి 23న సైబరాబాద్‌ పోలీసులు ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని, తెలుగుదేశం సమాచారం తీసుకెళ్లి వైసీపీకి ఇచ్చారని ఆంధ్రప్రదేశ్‌ నాయకులు చేస్తున్న ఆరోపణలను కూడా ఈ సందర్భంగా విలేకరులు స్టీఫెన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై ఆయన స్పందిస్తూ.. లోకేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణలో భాగంగా పోలీసులు ఫిబ్రవరి 22న ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయానికి వెళ్లారని, సంస్థతో పాటు ‘సేవామిత్ర’ యాప్‌ పనితీరు గురించి తెలుసుకున్నారని, ఆ రోజు కంప్యూటర్లు సహా ఏ వస్తువులూ స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు.

కేసు నమోదైన తర్వాత మార్చి 2న వెళ్లినపుడు మాత్రం కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఒకవేళ ఫిబ్రవరి 22న వెళ్లినప్పుడే ఏవైనా ఉపకరణాలు స్వాధీనం చేసుకొని ఉంటే ఆ ద‌ృశ్యాలు సంస్థ కార్యాలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదై ఉండేవి కదా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు.

అయితే ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయానికి పోలీసులు వెళ్లిన దృశ్యాలు బయటకు ఎలా వచ్చాయన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. అసలు పౌరుల వ్యక్తిగత సమాచారం ఎలా వచ్చింది? దాన్ని ఎలా దుర్వినియోగం చేశారు? ఈ విషయాలు ప్రధానమని, వీటిని నిగ్గు తేల్చడమే తమ పని అని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

పోలీసులు ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయానికి వెళ్లిన తర్వాత సేవామిత్ర యాప్‌లో అనేక మార్పులు చేసినట్లు గుర్తించామని, రంగుల ఫొటోలకు బదులు నలుపు తెలుపు ఫొటోలు ఉన్నాయని, చిరునామాలు మాయమయ్యాయని, దీనిపైనా దృష్టి పెట్టామని వివరించారు. నిందితుడు అశోక్‌ వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సి ఉందన్నారు.

స్వాధీనం చేసుకున్న ఉపకరణాలు ఫోరెన్సిక్‌ విశ్లేషణకు పంపామన్నారు. సేవామిత్ర యాప్‌ సమాచారం అమెజాన్‌, గూగుల్‌లో నిల్వ చేశారని, దీనిని పంపాలంటూ సైబరాబాద్‌ పోలీసులు ఇదివరకే ఆయా సంస్థలకు లేఖలు రాశారని, అక్కడ నుంచి ఇంకా సమాధానం రాలేదని తెలిపారు.

ఈ కేసు దర్యాప్తు అంతా సాంకేతిక అంశాలతో కూడుకున్నది కావడం వల్లే ‘సిట్‌’ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. కార్యక్రమంలో సిట్‌ సభ్యులుగా ఉన్న కామారెడ్డి ఎస్పీ శ్వేత, సైబరాబాద్‌ డీసీపీ (క్రైమ్) రోహిణీ ప్రియదర్శిని కూడా పాల్గొన్నారు. కాగా, డేటా చోరీ కేసులో సిట్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

చదవండి: ఓట్లు పోయినవాళ్లంతా జగన్‌ను నిలదీయాలి, 3 పార్టీల కుట్రలు: చంద్రబాబు ఫైర్

- Advertisement -