హైదరాబాద్ ‘మెట్రో’ వేళల్లో మార్పు.. అధికారుల కీలక ప్రకటన

metro-rail
- Advertisement -

metro-railహైదరాబాద్‌: మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు ఎల్‌ అండ్‌ టీ మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతం మార్పులు చేస్తున్న రైళ్ల సమయాలు తాత్కాలికమని, మళ్లీ మార్పులు ఉంటాయని ప్రకటించారు. ప్రస్తుతం మియాపూర్‌-అమీర్‌పేట మార్గానికి అదనంగా ఎల్‌బీనగర్‌ వరకు, హైటెక్‌ సిటీ వరకు కొత్తగా రెండు మార్గాలను అధికారులు త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.  ఈ నేపథ్యంలోనే మెట్రో రైళ్ల వేళల్లో ఈ మార్పులు చేస్తున్నామని,  ప్రస్తుతం అమీర్‌పేట-ఎల్‌బీనగర్‌ మార్గంలో మెట్రో ట్రయల్‌ రన్స్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు.

మారిన వేళలు ఇవే…

- Advertisement -

ఇప్పటివరకు సోమవారం నుంచి శనివారం వరకు మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యేవి.  అయితే ఇప్పుడు మారిన వేళల ప్రకారం.. రైళ్లు ఇక 6.30 గంటలకు ప్రారంభమవుతాయి. అదే విధంగా ఆదివారాల్లో ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే రైలు 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. రాత్రి వేళల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే రైళ్లు నడుస్తాయి. కేవలం ఉదయం వేళల్లో మాత్రమే అధికారులు మార్పులు చేశారు.

నాగోల్ స్టేషన్‌లో పనిచేయని టోకెన్‌ కౌంటర్లు…

నాగోల్‌ మెట్రో స్టేషన్‌లో  సాంకేతిక సమస్యల కారణంగా టికెట్‌ టోకెన్‌లను జారీ చేసే కౌంటర్లను అధికారులు మూసివేశారు.  దీంతో మెట్రోలో ప్రయాణం చేసేందుకు వచ్చిన ప్రయాణికులను మెట్ల మార్గం, లిప్టులు, ఎస్కలేటర్‌ మార్గాల వద్దే సిబ్బంది నిలిపి వేశారు. టోకెన్‌ కౌంటర్లు పనిచేయడం లేదని సిబ్బంది ప్రయాణికులకు చెబుతూ, కేవలం స్మార్ట్‌ కార్డు ఉన్న వారే మెట్రోలో ప్రయాణం చేసేందుకు అవకాశం ఉందని చెప్పారు. నాగోల్‌ స్టేషన్‌లో గురువారం ఉదయం వేళల్లో ఈ పరిస్థితి తలెత్తిందని మెట్రో అధికారులు తెలిపారు. కొన్ని గంటల పాటు అసౌకర్యం కలిగినట్లు సమాచారం.

అనౌన్స్‌మెంట్‌లోనూ తప్పులు…

మెట్రో రైళ్లో ప్రయాణ సమయంలో తప్పులు దొర్లుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. గురువారం అమీర్‌పేట నుంచి మియాపూర్‌కు బయలు దేరిన మెట్రో రైలులో ఎస్సార్‌ నగర్‌ మెట్రోస్టేషన్‌ చేరుకునే సమయంలోనే జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్‌ వచ్చిదంటూ అనౌన్స్‌మెంట్‌ చేశారని, దీంతో తాము ఆశ్చర్యానికి గురయ్యామని, అయితే ఆ తర్వాత మళ్లీ వెంటనే అనౌన్స్‌మెంట్‌ సిబ్బంది తమ తప్పును సరిదిద్దుకుని..  సవ్యంగా అనౌన్స్‌ చేశారని ప్రయాణికులు పేర్కొన్నారు.

- Advertisement -