అమీర్‌పేట్-ఎల్బీ నగర్ మార్గంలో ప్రారంభమైన మెట్రో రైలు..

ameerpet-lb-nagar
- Advertisement -

ameerpet-lb-nagarnarasimhan-ktr-ameerpet-metro-rail

హైదరాబాద్ : భాగ్యనగరంలో మెట్రో రైలు సేవలు మరింత మందికి అందుబాటులోకి వచ్చాయి. సోమవారం  అమీర్‌పేట్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు సేవలను గవర్నర్ నరసింహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ఇక ఇప్పుడు ఎల్బీనగర్ నుంచి మియాపూర్‌కు మెట్రో రైలు ద్వారా 52 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.

- Advertisement -

ప్రస్తుతం ఎల్బీనగర్ నుంచి మియాపూర్‌కు వెళ్లడానికి  బస్సులో అయితే దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. అదే బైక్‌పై వెళితే ఒక అరగంట అటు ఇటుగా చేరుకోవచ్చు.  అదే గనుక  మెట్రో రైలులో వెళితే.. ఈ చివర ఉన్న ఎల్బీనగర్ నుంచి ఆ చివర ఉన్న మియాపూర్‌కు గంటలోపే చేరుకోవచ్చు.

16 కిలోమీటర్లు, 17 మెట్రో స్టేషన్లు…

అమీర్‌పేట-ఎల్బీ నగర్ మార్గం మొత్తం 16 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 16 కిలోమీటర్ల దూరంలో మొత్తం 17 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. అవి -పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, లక్డీకపూల్, అసెంబ్లీ, నాంపల్లి, గాంధీభవన్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఎంజీబీఎస్ జంక్షన్, మలక్ పేట, న్యూ మలక్ పేట, మూసారంబాగ్, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, విక్టోరియా మెమోరియల్ స్టేషన్లు.

ప్రతి 5 నిమిషాలకు ఒక రైైలు…

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశగా.. అమీర్‌పేట్-ఎల్బీ నగర్ మార్గంలో మెట్రో రైలును గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ మార్గంలో మొత్తం 18 రైళ్లు తిరుగుతాయి. ప్రస్తుతం ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుందని, ఫ్రీక్వెన్సీని బట్టి రెండు నిమిషాలకు ఒక రైలు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు తయారు చేస్తామని మెట్రో రైలు అధికారులు తెలిపారు.

అమీర్ పేట్-హైటెక్ సిటీ మార్గం త్వరలో.. 

అమీర్‌పేట నుంచి ఎల్బీ నగర్‌కు తాజాగా మెట్రో రైలు ప్రారంభం కావడంతో కారిడార్ -1లోని 29 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీ మెట్రో రైలు కూడా అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. అమీర్‌పేట్- హైటెక్ సిటీ మెట్రో మార్గం నిర్మాణ పనులు డిసెంబర్‌లోగా పూర్తయి.. సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు.

ఛార్జీలు ఇలా… 

ఛార్జీల విషయానికొస్తే.. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్లాలంటే ఏసీ బస్సులో రూ.78 చెల్లించాల్సి ఉంటుంది. అదే మెట్రో రైలులో అయితే రూ.60 చెల్లిస్తే సరిపోతుంది. పైగా ట్రాఫిక్ జంజాటం లేకుండా త్వరగా గమ్యస్థానం చేరుకోవచ్చు. మధ్యలో నాంపల్లి రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్, ఉండటంతో దూరప్రాంతాల నుంచి రైల్వేస్టేషన్ బస్టాండ్‌లకు చేరుకునే ప్రయాణికులతో మెట్రోకు మరింత ప్రజాదరణ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఎంజీబీఎస్ దగ్గర ఉన్న ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ ఆసియాలోనే అతిపెద్ద ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌గా చెబుతున్నారు .

 

- Advertisement -