హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. 7 నుంచి పరుగులు పెట్టనున్న మెట్రో.. సిటీ బస్సులకు అనుమతి నిల్

- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్లు మళ్లీ పరుగు పెట్టనున్నాయి. 21వ తేదీనుంచి వివాహాలు, అంత్యక్రియలను 100 మందితో నిర్వహించుకోవచ్చు. 30వ తేదీ వరకు కంటైన్మెంట్‌ జోన్లు కొనసాగుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్‌లాక్‌ -4 ఉత్తర్వులను అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌పూల్స్‌, ఎంటర్‌టైన్మెంట్‌ పార్కులు, థియేటర్లు ఇలాంటి ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

- Advertisement -

7వ తేదీనుంచి మెట్రో రైల్‌ నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కంటైన్మెంట్‌ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ (ఎస్ఓపీ) పాటిస్తూ లాక్‌డౌన్‌కు ముందు ఉన్న అన్ని కార్యక్రమాలకు అనుమతిస్తున్నట్టు పేర్కొన్నది. 

మార్గదర్శకాలు ఇలా..

  • ఆన్‌లైన్‌ క్లాసులు, దూరవిద్యకు అనుమతి. ప్రోత్సాహం.
  • 21 నుంచి ఆన్‌లైన్‌ టీచింగ్‌, టెలీకౌన్సెలింగ్‌, దీనికి సంబంధించిన పనులకు విద్యాసంస్థలకు ఒకే సమయంలో 50 శాతం టీచింగ్‌-నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు అనుమతి.
  • 21 నుంచి ఐటీఐలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణకు, ఉన్నత విద్యాసంస్థల్లో పీహెచ్‌డీ, పీజీ టెక్నికల్‌ ప్రోగ్రాంలకు అనుమతి.
  • ఈ నెల 21 నుంచి సోషల్‌, అకడమిక్‌, స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్మెంట్‌, కల్చరల్‌, రిలీజియస్‌, రాజకీయ సమావేశాలతోపాటు ఇతర జనసమూహ కార్యక్రమాలను వందమందికి మించకుండా నిర్వహించుకోవచ్చు.  
  • ప్రస్తుతానికి బార్లు, క్లబ్‌లు బంద్‌. వీటిని ప్రారంభించడానికి ప్రత్యేక ఆదేశాలు జారీచేస్తారు.

సిటీ బస్సుల విషయంలో మరికొంతకాలం ఆగాల్సిందే..

లాక్‌డౌన్-4లో భాగంగా పలు సడలింపులు ఇచ్చిన కేంద్రం మెట్రో రైలు విషయంలో మాత్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది.

దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, సిటీ బస్సుల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గత రాత్రి వరకు కూడా ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వం నుంచి ఎటువంటి అదేశాలు అందలేదు.

మెట్రో రైళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సిటీ బస్సులకు కూడా అనుమతి ఇస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావించారు. తామైతే బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించి ఎటువంటి సంకేతాలు అందలేదని ఆర్టీసీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

మెట్రో రైళ్లలో అయితే ప్రయాణికులను నియంత్రించడంతోపాటు భౌతికదూరం వంటి నిబంధనలను పాటించేందుకు అవకాశం ఉంటుందని, కానీ, సిటీ బస్సుల విషయంలో అది సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే కేసులు పెద్ద ఎత్తున బయటపడుతున్న నేపథ్యంలో సిటీ బస్సులు నడిపితే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్న ప్రభుత్వం.. సిటీ బస్సుల విషయంలో మరికొంతకాలం వేచి చూడాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

- Advertisement -