హైదరాబాద్ పోలీసులకు షాక్! నేరస్తుడు మారిపోయాడనుకుంటే ఏం చేశాడో తెలుసా?

5 days ago

హైదరాబాద్: నేరస్తులలో మార్పు తెచ్చేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు ఫలితం ఇస్తున్నా.. కొంతమంది నేరస్తులలో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదు. కాకపోతే మారినట్లు నటిస్తున్నారంతే.

మూడు రోజుల క్రితం జహీరాబాద్‌లో జరిగిన ఘటనే ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. పోలీసులమంటూ ఓ మహిళను బలవంతంగా బస్సు నుంచి దించి, ఆపైనా ఆమెపై అత్యాచారం చేసిన నేరస్తుల్లో ఒకడు మారిపోయాడని పోలీసులు భావించారు. కానీ వాస్తవంలో జరిగింది మరొకటి. 

వివరాల్లోకి వెళితే… వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన కె.వీరబ్రహ్మచారి పదో తరగతి వరకే చదువుకున్నాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో ఈజీ మనీ కోసం అడ్డదార్లు తొక్కడం మొదలుపెట్టాడు. మావోయిస్టుల పేరుతో దందాకు తెరలేపాడు.

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలోనూ మావోల పేరుతో ధనవంతుల నుంచి డబ్బులు గుంజడం మొదలుపెట్టాడు. డబ్బు కోసం 2005లో హయత్‌నగర్‌లో ఓ వ్యక్తిని హత్య కూడా చేశాడు.

ఈ కేసులో 2012లో వీరబ్రహ్మంను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే అతడిపై 32 కేసులు ఉన్నాయి. ఈ కేసులో అతడికి ఐదేళ్ల శిక్ష పడింది.

మార్పు వచ్చిందేమో అనుకుంటే…

శిక్ష పూర్తయిన తర్వాత జైలు నుంచి విడుదలైన వీరబ్రహ్మచారి 2015లో అప్పటి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి బతుకుతెరువు కోసం తనకో దారి చూపించమని వేడుకున్నాడు.

దీంతో చర్లపల్లి జైలు అధికారులతో మాట్లాడిన పోలీసు కమిషనర్ స్వయం ఉపాధి కోసం ఉప్పల్ రింగ్‌ రోడ్డులో టీ పాయింట్‌ పెట్టించారు. అప్పటి డీసీపీ నవీన్ కుమార్ 2015లో రిబ్బన్ కట్ ‌చేసి ఈ టీ పాయింట్‌ను ప్రారంభించారు.

స్వయం ఉపాధితో అతడు తన నేరప్రవృత్తిని వదిలి అందరిలా ఆనందంగా బతకాలంటూ ఈ సందర్భంగా డీసీపీ వీరబ్రహ్మచారికి సూచించారు. టీపాయింట్ పెట్టిన తర్వాత వీరబ్రహ్మచారి మారిపోయాడనే పోలీసులు భావించారు.

ఓసారి రోడ్డు విస్తరణలో భాగంగా అతడి టీపాయింట్ అక్కడ్నించి మారిపోకుండా కూడా సహాయం చేశారు. ఇటీవల అర్ధరాత్రి వరకు టీ డబ్బా నడుపుతుండడంతో ఉప్పల్ పోలీసులు వీరబ్రహ్మచారిపై పెట్టీ కేసు నమోదు చేశారు.

వారం నుంచి ఆచూకీ లేదు…

దీంతో వీరబ్రహ్మచారి ఆ టీపాయింట్‌ నిర్వహణను మరొకరికి అప్పగించాడు. అంతేకాదు, గత వారం రోజులుగా అతడు  ఆ టీపాయింట్ వద్ద కనిపించడం లేదు కూడా.

కట్ చేస్తే.. మూడు రోజుల క్రితం జహీరాబాద్‌లో పోలీసుల పేరుతో ఓ బస్సును ఆపిన దుండగులు ఓ ప్రయాణికురాలి సంచిలో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయంటూ బస్సు నుంచి బలవంతంగా దించారు. ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుల్లో వీరబ్రహ్మచారి కూడా ఉన్నట్టు తెలుసుకుని విస్తుపోయారు.