నేను రెడీ.. నువ్వూ రెడీయేనా? లేదంటే మీది ఆ వంశమే కాదు: కేటీఆర్ సవాల్‌కు రేవంత్ ప్రతి సవాల్!

ktr-revanth-reddy-challenge
- Advertisement -

ktr-revanth-reddy-challenge

హైదరాబాద్: ఎన్నికల సమయంలో నాయకుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు మనం చూస్తూనే ఉంటాం. అయితే తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నడుమ సవాల్, ప్రతి సవాల్ మాత్రం తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. కొడంగల్‌లో ఈసారి రేవంత్ రెడ్డి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

‘‘కొడంగల్‌లో నేను గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. నేను నిజంగానే ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. నాకేం అభ్యంతరం లేదు. ఒకవేళ నేను గెలిస్తే మాత్రం కేటీఆర్ కూడా అన్న మాట మీదనే నిలబడాలి.

ఆయన రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలి. లేనిపక్షంలో కేటీఆర్‌ది అసలు కల్వకుంట్ల వంశమే కాదనా భావించాల్సి వస్తుంది..’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

20 లక్షల మంది ఓట్లు హరించారు…

టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసే వారి వివరాలు పోలింగ్ బూత్‌ల వారీగా ముందుగానే గుర్తించి, ప్రతి బూత్ పరిధిలో 50 నుంచి 200 వరకు ఓట్లు తొలగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకునేందుకే టీఆర్ఎస్ నేతలు ఇలా చాలా ప్రయత్నాలు చేశారని వ్యాఖ్యానించారు. వీరి కుట్ర కారణంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది ఓటు హక్కుకు దూరమయ్యారంటూ ఆయన దుయ్యబట్టారు.

ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు…

తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు రాబోతోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2009లో ఇదే రోజున ( డిసెంబర్ 9 ) ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియోగాంధీ ప్రకటన చేశారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో ప్రభుత్వాన్ని ప్రజా కూటమి ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు.

ప్రజా కూటమికి అధికారం అప్పజెప్పడం ద్వారా తెలంగాణ ప్రజలు సోనియాగాంధీకి పుట్టిన రోజు (డిసెంబర్ 7) బహుమతి ఇచ్చారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

- Advertisement -