భాగ్యనగరంలో ఇంటర్నేషనల్ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్‌ ప్రారంభం!

venkaiah-naidu-kites-and-sweet-festival-inuguaration-1
- Advertisement -

international-kite-and-sweet-festival

సికింద్రాబాద్: తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నఇంటర్నేషనల్ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ వేడుకలను ఆదివారం సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కైట్స్, స్వీట్స్ ఫెస్టివల్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి భారతీయ పౌరుడు దేశీయ వంటకాలను తినాలని, పండుగలను జరుపుకుని సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలన్నారు. ఓవైపు పతంగులు, మరోవైపు స్వీట్లు అరుదైన కాంబినేషన్ అని మకర సంక్రాంతి నేపథ్యంలో ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

హైదరాబాద్ ఓ అద్భుతం…

హైదరాబాద్ ఓ అందమైన నగరమని, ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన నగరమని వెంకయ్యనాయుడు చెప్పారు. అంతేకాదు, హైదరాబాద్ ఎవరినైనా తన అక్కున చేర్చుకుంటుందని అన్నారు. ఇక మన హైదరాబాద్ దమ్ బిర్యానీ రుచి గురించి వేరే చెప్పాలా అంటూ ప్రశ్నించారు. అలాగే కరాచీ బిస్కట్లు, ఇరానీ చాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇవన్నీ కలిస్తేనే మన హైదరాబాద్ అని వ్యాఖ్యానించారు.

చికెన్ 65పై సెటైర్లు…

‘‘హోటల్‌కు వెళితే చికెన్ 65 అని ఉంటుంది. చూస్తే మీ వయసు 25 ఉంటుంది. అది మీరు తింటే మీ వయసు తొందరగా 65 అవుతుంది. ఆ వంటకాలు ఎక్కువగా తింటే త్వరలోనే వయసు 85 కూడా అవుతుంది..’’ అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సరదాగా వ్యాఖ్యానించారు.

తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అన్ని విషయాల్లో సహకరించుకుని ముందుకు సాగాలని, మన సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు పండుగలు, ఆటలు, పాటలు, వంటకాలు అన్నింటికీ పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

కార్యక్రమంలో హోం మత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. మూడురోజుల పతంగుల పండగ అందరిలోనూ ఉత్సాహం నింపుతోందన్నారు. పతంగుల పండగకు వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు తరలివచ్చారని, సంక్రాంతి సందర్భంగా పతంగుల పండగ జరగటం చాలా సంతోషకరమన్నారు.

అందుబాటులో 1,200 రకాల స్వీట్లు…

మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలో 20 దేశాల నుంచి 42 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు, పెద్ద సంఖ్యలో సందర్శకులు పాల్గొంటారు. ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్‌లో భాగంగా 22 దేశాలు, దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 1,200 రకాల స్వీట్లను అందుబాటులో ఉంచుతారు.

ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు కైట్ ఫెస్టివల్‌లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. జీహెచ్‌ఎంసీ, పోలీసు, ఇతరశాఖల సమన్వయంతో దీనికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

- Advertisement -