యురేనియం తవ్వకాలపై వెనక్కి తగ్గిన కేసీఆర్ ప్రభుత్వం

1:20 pm, Sun, 15 September 19

హైదరాబాద్: యురేనియం తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. భవిష్యత్తులోనూ వీటికి ఎలాంటి అనుమతులను ఇవ్వబోమని స్పష్టం చేశారు.

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయంపై మాట్లాడారు. 2016 లోనే అన్వేషణకు అనుమతిచ్చిన వన్యప్రాణుల సంరక్షణ విభాగం తవ్వకాలకు మాత్రం అనుమతివ్వలేదన్నారు.

యురేనియం నిక్షేపాల కోసం నల్గొండ జిల్లాలో అన్వేషణ చేపట్టినా.. నాగర్‌కర్నూల్‌- అమ్రాబాద్‌ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని తెలిపారు.

ఆయా ప్రాంతాల్లో నిక్షేపాలున్నప్పటికీ అనుమతులివ్వబోమని వన్యప్రాణుల సంరక్షణ విభాగం స్పష్టం చేసిందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు.

రోజులుగా యురేనియం తవ్వకాల అంశం ఇటీవల తెరపైకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. యురేనియం తవ్వకాలను నిలిపివేయాలంటూకాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ‘సేవ్ నల్లమల్ల’ కార్యక్రమానికి ప్రణాళికలు రచించింది.

ఉద్యమం కోసం సీనియర్ నేత వీహెచ్ (వి.హనుమంతరావు)తో కమిటీ కూడా వేసింది. మరోవైపు, సినీ తారలు కూడా సోషల్ మీడియా వేదికగా ‘సేవ్ నల్లమల్ల’ పేరుతో ఉద్యమం చేపట్టారు.