టీడీపీ సీనియర్ నేతతో కేసీఆర్ భేటీ: త్వరలో టీఆర్ఎస్‌లోకి మండవ

7:01 pm, Fri, 5 April 19
kcr-mandava

హైదరాబాద్: తెలంగాణ టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు.

శుక్రవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మండవ వెంకటేశ్వరరావు ఇంటికి కేసీఆర్‌ వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్‌లో చేరాలని ఈ సందర్భంగా మండవను కేసీఆర్‌ ఆహ్వానించారు.

ఎన్నికల ముందే అనుకున్నా..

అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే మండవ.. టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబునాయుడు కేబినెట్‌లో కేసీఆర్‌, మండవ వెంకటేశ్వరరావులు సహచరులుగా పని చేశారు. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరగా, కొందరు సీనియర్ నేతలు బీజేపీ పార్టీలో చేరారు.

కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పదిమందికిపైగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మరికొందరు కూడా అధికార పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు డీకే అరుణ, రాపోలు ఆనంద భాస్కర్‌లు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

చదవండి: పవన్ కళ్యాణ్‌పై మాయావతి ప్రశంసల వర్షం: జనసేనాని పాదాభివందనం