ఎన్నికల హీట్ పెంచుతున్న నేతలు: టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రచార హోరు

bjp-congress-trs
- Advertisement -

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు తెలంగాణలో ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఓ వైపు మండిపోతున్న ఎండలకు తోడు.. రాజకీయ నేతలు ప్రసంగాలతో రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ అతి త్వరలో వస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో ప్రధాన పార్టీల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల సమరానికి శంఖం పూరించాయి.

పార్లమెంటరీ సన్నాహక సమావేశాలతో టీఆర్‌ఎస్.. నిజామాబాద్‌లో జరిగిన అమిత్‌ షా బహిరంగసభ నుంచి బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి. ఇక కాంగ్రెస్ కూడా ప్రచారానికి సిద్ధమైంది. మార్చి 9న జరిగే రాహుల్‌ సభ ద్వారా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుంది. ఎన్నికలు దగ్గరపడుతున్న దృష్ట్యా జాతీయ పార్టీల నేతలు కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత 16 ఎంపీ సీట్లే లక్ష్యంగా టీఆర్ఎస్

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ లోకసభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు పేరుతో ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈసారి రాష్ట్రంలోని 16 లోక్‌సభ స్థానాలు గెలవాల్సిందేనని పార్టీ నేతలకు స్పష్టం చేశారు.

జాతీయస్థాయి రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలంటే తగినన్ని సీట్లు సాధించాలనే ధ్యేయంతో ఆయన పార్టీ శ్రేణులను ముందుండి నడిపిస్తున్నారు. తాజాగా, పార్టీ బాధ్యతలు తీసుకున్న కేసీఆర్‌ తనయుడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా ప్రచారం దూసుకెళ్తున్నారు. కరీంనగర్‌ నుంచి శంఖారావాన్ని పూరించిన ఆయన పార్టీ పార్లమెంటరీ స్థాయి సమావేశాలకు పెద్ద ఎత్తున హాజరైన కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ తర్వాత ఆయన వరంగల్‌లో సమావేశం నిర్వహించి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఇక వరుసగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల సమావేశాలకు ఆయన హాజరై క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని ఎన్నికల దిశగా సమాయత్తం చేయనున్నారు. మరోవైపు పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను సైతం కేసీఆర్‌ ప్రారంభించారని తెలంగాణ భవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దాదాపు పాతవారందరికీ మరోసారి అవకాశమిస్తారని, మూడు లేదా నాలుగు స్థానాల్లో మాత్రమే మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. తెలంగాణలో 16స్థానాలను దక్కించుకుని కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలకు కట్టబెట్టాలను ప్రజలకు పిలుపునిస్తున్నారు.

రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్

అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ కూడా లోకసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకునేందుకు సమాయత్తమైంది.
ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూడా లోక్‌సభ సమరానికి సిద్ధమవుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని కావాలంటే రాష్ట్రం నుంచి కనీసం 10 సీట్లు గెలవాలనే వ్యూహంతో ముందుకెళుతోంది. అందులో భాగంగానే మార్చి 9న రాహుల్‌గాంధీనే స్వయంగా లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు రాష్ట్రానికి వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలో టీపీసీసీ ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగసభలో ఆయన పాల్గొని తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తి చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. రాహుల్‌ రాష్ట్ర పర్యటన తర్వాత అభ్యర్థులను ఖరారు చేసుకోనుంది. మార్చి 10న ఢిల్లీలో స్కీనింగ్‌ కమిటీ సమావేశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం వారం, పదిరోజుల్లో అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని దేశంలో మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు తమను ఆదరించాలనే ప్రధాన నినాదంతోనే కాంగ్రెస్‌ ఈసారి ఎన్నికలకు వెళ్లనుంది.

సంక్షేమాభివృద్ధి, దేశ భద్రత కోసం మోడీ అంటూ బీజేపీ..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తెలంగాణలో తమ లోకసభ స్థానాలను పెంచుకునేందుకు గట్టి ప్రయత్నం చేసేందుకు సిద్ధమైంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం నిజామాబాద్‌ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మళ్లీ రెండోసారి మోడీ ప్రధాని కావాలనే ధ్యేయంతో.. ఉన్న ఒక్క సీటును నిలబెట్టుకోవడంతో పాటు లోక్‌సభలో పార్టీ తరఫున రాష్ట్ర ప్రాతినిధ్యం పెంచుకోవాలనే వ్యూహంతో బీజేపీ నేతలు ఈసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థుల ఖరారుపై పార్టీలో ఇప్పటికే ప్రాథమిక కసరత్తు కూడా పూర్తయింది. రాష్ట్ర పార్టీ ఇంచార్జి లింబావళితో పాటు పలువురు ముఖ్య నేతలు ఇప్పటికే సమావేశమై ఆశావహుల జాబితాను తయారు చేసినట్లు తెలిసింది.

మోడీ చరిష్మాతో పాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. 2014కు ముందు దేశం పరిస్థితిని, ప్రస్తుత పురోగతిని వివరిస్తూ ఎన్నికల్లో వీలున్నంత మేర లబ్ధి పొందడమే లక్ష్యంగా కమలనాథులు ముందుకెళ్లనున్నారు. ప్రజలకు సంక్షేమాభివృద్ధి ఫలాలు అందాలన్న.. దేశ భద్రంగా ఉండాలన్న మరోసారి మోడీ ప్రధాని కావాలంటూ బీజేపీ ప్రజలకు పిలుపునిస్తోంది.

లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే చెప్పుకోదగ్గ పోటీ ఉండనుంది. ఎంఐఎం మాత్రం ఒక్క హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక వామపక్షాలు, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీలు ఈ సారి ఎన్నికల్లో ఏ మేరకు పోటీ చేస్తాయనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిగా ఏర్పడ్డ టీడీపీ, సీపీఐలు మళ్లీ కూటమిలో ఉంటాయా..? లేక ఎవరికివారే పోటీలో ఉంటారా? అనేది త్వరలోనే తేలనుంది. పోటీ ఎలాగున్నా.. ప్రచారంలో మాత్రం అన్ని పార్టీల నేతలు హోరెత్తించే అవకాశం ఉంది.

చదవండి: మోడీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం సురక్షితం, లేదంటే.: అమిత్ షా

- Advertisement -