పెద్దలు కాదనడంతో ప్రేమజంట ఆత్మహత్య! మొదట ప్రియురాలు, ఆ తర్వాత ప్రియుడు…

lovers
- Advertisement -

lovers

కడ్తాల్‌: తమ ప్రేమకు ఇరువైపుల పెద్దలు అడ్డు చెప్పారన్న మనస్థాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతమిది.  ఇద్దరి వయసులో తేడాతో పాటు వారి వరుసలు కూడా కుదరకపోవడంతో వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు నిరాకరించినట్లు తెలుస్తోంది. షాద్‌నగర్‌ ఎసీపీ సురేందర్, కడ్తాల్‌ ఎస్‌ఐ సుందరయ్యల వివరాల ప్రకారం…

- Advertisement -

రంగరెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం చరికొండ పంచాయతీ పరిధిలోని బోయిన్‌గుట్ట తండాకు చెందిన నేనావత్‌ రఘు, మంగమ్మ దంపతుల రెండో కూతురు నేనావత్‌ రేణుక(14), అదే తండాకు చెందిన పాత్లవత్‌ హూమ్లా, కేడీ దంపతుల మూడో కుమారుడు పాత్లావత్‌ రాజునాయక్‌ (23) ప్రేమించుకున్నారు.

ఇంట్లోంచి వెళ్లిపోయి…

వివాహం చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని ఈ సంవత్సరం ఏప్రిల్‌లో వారు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. దీంతో రేణుక తల్లిదండ్రులు కడ్తాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్, కిడ్నాప్‌ కేసులు నమోదు చేసి… రేణుక, రాజునాయక్‌ని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. రేణుకకు స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ ఇచ్చి, రాజునాయక్‌‌ను రిమాండ్‌కు పంపిచారు.

ఈ క్రమంలో.. రెండు నెలల క్రితమే జైలు నుంచి విడుదలైన  రాజునాయక్ గతంలో మాదిరిగానే ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజుల క్రితం రేణుకతో మళ్లీ రాజు మాట్లాడాడని కొందరు రేణుక తల్లి మంగమ్మతో చెప్పారు.  దీంతో ఈ నెల 11న రేణుకను ఆమె తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రేణుక 12వ తేదీ ఉదయం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.

పురుగుల మందు తాగిన రేణుకను చికిత్స నిమిత్తం వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఆదివారం సాయంత్రం మృతి చెందింది. రేణుక  మృతదేహన్ని సోమవారం బోయిన్‌గుట్టకు తండాకు తీసుకువచ్చిన ఆమె తల్లిదండ్రులు..  రాజు కారణంగానే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందంటూ అతడి ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేశారు.

ఈ విషయంలో ఇరువైపుల పెద్దలు ఘర్షణకు దిగడంతో సమాచారం అందుకున్న పోలీసులు తండాకు చేరుకుని ఇరువర్గాల వారిని శాంతింపజేశారు. మరోవైపు రేణుక కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి  ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.  ప్రియురాలి ఆత్మహత్యతో అప్పటికే తీవ్ర మనస్థాపానికి గురై ఉన్న రాజునాయక్ కూడా  మంగళవారం ఉదయం వ్యవసాయ భూమిలో విగతజీవుడిగా కనిపించాడు.

ఆత్మహత్యా? హత్యా?

ఇది గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే తండాకు చేరుకున్న మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు.. రాజునాయక్‌‌ది ఆత్మహత్య కాదని, అతడిని హతమార్చి నోట్లో పురుగుల మందు పోశారని ఆరోపించారు.

దీంతో తండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో అక్కడి పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసు ఉన్నతాధికారులు..  ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్‌ఐలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం రాజునాయక్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇరువురి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -