27న మహాకూటమి అభ్యర్థుల తొలి జాబితా, అసంతృప్తులు చల్లారతాయి, చంద్రబాబు ప్రచారం చేస్తారు: పెద్దిరెడ్డి

4:15 pm, Tue, 23 October 18
peddi reddy

peddi reddy

హైదరాబాద్: అక్టోబర్ 27న మహా కూటమి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు టీడీపీ తెలంగాణ రాష్ట్ర నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 1వ తేదీలోపుగా మహాకూటమి అభ్యర్థుల పూర్తి స్థాయి జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు మహాకూటమిలోని పార్టీలన్నీ కలిసికట్టుగా పనిచేస్తున్నాయని పెద్దిరెడ్డి చెప్పారు. కూటమిలోని పార్టీలన్ని సీట్ల సర్దుబాటులో కొంత మేర అసంతృప్తి చెందుతున్నప్పటికీ, టీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తున్నందున ఆ అసంతృప్తి ఎక్కువ కాలం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

మహాకుటమిలో సీట్లు ఫైనల్ కాకముందే శేరిలింగంపల్లి సీటు కోసం ఆందోళన చేయడం బాధాకరమన్నారు. అంతా త్వరలోనే సర్దుకుంటుందని,  టీడీపీ అభ్యర్థుల తరపున తెలంగాణలో చంద్రబాబునాయుడు ప్రచారం నిర్వహిస్తారని పెద్దిరెడ్డి ప్రకటించారు.