50 వేల ఓట్లు గల్లంతు.. మల్కాజ్‌గిరిలో రీపోలింగ్‌కు డిమాండ్…

12:18 pm, Sat, 8 December 18
malkajgiri mahakutami candidate demands to repolling for votes missing

telangana-map-ec-building

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారంతో పూర్తయ్యింది. ఫలితాలు కోసం మంగళవారం వరకు ఎదురుచూడల్సిందే. అయితే నిన్న జరిగిన పోలింగ్‌లో పలు ప్రాంతాల్లో చాలా మంది ఓటర్ల ఓట్లు గల్లంతయ్యాయి. దీనిపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు కూడా.

ఈ క్రమం‌లో మల్కాజ్‌గిరి ప్రజా కూటమి అభ్యర్థి మల్కాజ్‌గిరిలో రీ పోలింగ్‌ నిర్వహించాలని ప్రజాకూటమి తరపున పోటీ చేసిన తెలంగాణ జన సమితి అభ్యర్థి కపిలవాయి దిలీప్‌కుమార్‌ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘం సీఈఓ సునీల్‌ ఆరోరాకు వినతిపత్రం పంపారు.

50 వేల మంది ఓటర్ల పేర్లు గల్లంతు…

తాను బరిలో ఉన్న మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో దాదాపు 50 వేల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యాయని, పలు ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద జాబితాలో పేరు లేకపోవడంతో తాము ఓటు వేయలేకపోయామని పౌరులు నిరసన వ్యక్తం చేశారని దిలీప్‌కుమార్‌ ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు.

ఇలా భారీ స్థాయిలో ఓట్లు గల్లంతవడం ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కొందరు ఓటర్లకు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను కేటాయించారని, దీంతో పలువురు పోలింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదన్నారు.

కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది ఇంటింటికి పోలింగ్‌ స్లిప్పులు కూడా ఇవ్వలేదని  వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని జాబితాలో గల్లంతైన ఓటర్లు పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, ఆ తరువాత రీ పోలింగ్‌ నిర్వహించాలని దిలీప్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అవసరమైతే మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపు తేదీని పొడిగించి.. రీ పోలింగ్‌ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.