ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి…

12:27 pm, Sat, 18 May 19

ఏటూరునాగారం: కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఏటూరు నాగారం శివారులోని జీడివాడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీతక్క ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో చిన్నారి స్రవంతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా చిన్నారి తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన దంపతులను వెంటనే ఏటూరునాగారంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీతక్క ప్రయాణిస్తున్న వాహనం ముందుభాగం ధ్వంసమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతేడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన సీతక్క ములుగు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.