మసీదు కట్టుకునే భూమి లేక కాదు.. : అయోధ్య తీర్పుపై ఒవైసీ అసంతృప్తి

5:22 pm, Sat, 9 November 19

హైదరాబాద్: దశాబ్దాల తరబడి కొనసాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు నేడు తెరదించింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించి, మసీదు నిర్మాణానికి కేంద్రం అయోధ్యలోనే ఐదెకరాల ప్రత్నామ్నాయ స్థలాన్ని సూచించాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి
వ్యక్తం చేశారు.

మసీదు కట్టుకునే భూమి లేక తాము పోరాటం చేయలేదని, న్యాయపరమైన హక్కు కోసమే ఇన్నాళ్లూ ఫైట్
చేశామని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తమకు ఎవరి భిక్ష అవసరం లేదని తేల్చి చెప్పారు.

ఐదెకరాల ప్రత్యామ్నాయ భూమిని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తిరస్కరించాలని సూచించారు. సుప్రీం తీర్పే ఫైనల్ అయినప్పటికీ న్యాయస్థానం పొరపాటుపడదని లేదని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, సంఘ్‌పరివార్‌పైనా ఒవైసీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నిజస్వరూపం ఏమిటో అప్పట్లోనే బయటపడిందన్నారు. ఆ పార్టీ వంచన కారణంగానే 1949లో విగ్రహాలు అక్కడ వెలిశాయని అన్నారు.

తాళాలు తెరవాలని ఆరోజు రాజీవ్ గాంధీ  ఆదేశించకుండా ఉంటే, ఇప్పటికీ అక్కడ మసీదు ఉండేదేనని ఆయన అన్నారు. పీవీ నరసింహారావు తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ఉన్నా అక్కడ మసీదే ఉండేదని ఎంఐఎం చీఫ్ అన్నారు.

డిసెంబర్ 6న మసీదును కూల్చకపోతే కోర్టు తీర్పు ఎలా ఉండేది? మసీదు అక్కడే ఉండి ఉంటే ఏం తీర్పు చెప్పేది? అని ఆయన ప్రశ్నించారు. బాబ్రీ మసీదును కూల్చిన వారికే అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించడం ఏమిటని ఒవైసీ నిలదీశారు.