రేపే ప్రారంభం: అమీర్‌పేట్-హైటెక్ సిటీ మెట్రో రైలు.. గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా …

5:05 pm, Tue, 19 March 19
Ameerpet-HitechCity-Metro-Rail

హైదరాబాద్: ఐటీ కంపెనీల్లో పనిచేసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం ఉద్యోగులు హైటెక్ సిటీ ప్రాంతానికి వెళుతుంటారు. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని సమయానికి ఆఫీసులకు వెళ్లలేక ఎంతోమంది ఇబ్బందులు పడుతుందారు. ఇప్పుడిక ఈ ఇబ్బంది తొలగిపోనుంది. అవును, నగరవాసుల నిరీక్షణ ఫలించింది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అమీర్‌పేట్-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం ఎట్టకేలకు ఖరారు అయింది. ఈ నెల 20.. అంటే బుధవారం ఉదయం 9.15 గంటలకు ఈ రైలు ప్రారంభం కానుంది. ఈ మార్గంలో మెట్రో రైలు ప్రారంభంతో ఇటు ఐటీ ఉద్యోగులకే కాక.. నిత్యం వివిధ పనులపై ఆ ప్రాంతానికి వెళ్లే వారికి ఎంతో ఊరట కలగనుంది.

బుధవారం ఉదయం గవర్నర్ నరసింహన్ అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌లో పచ్చజెండా ఊపి ఈ మార్గంలో మెట్రో రైలును ప్రారంభించనున్నారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఈ మార్గంలో నడిచే మెట్రో రైళ్లలో ప్రజలు ప్రయాణించవచ్చు. ఈ మేరకు అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌లో ప్రారంభోత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ కేవీబీ రెడ్డి, సీవోవో అనిల్‌కుమార్‌ సైనీ సోమవారం ఈ ఏర్పాట్లను పరిశీలించారు.

మొత్తం 27 కిలోమీటర్ల కారిడార్…

నాగోల్-హైటెక్ సిటీ మార్గంలో మొత్తం 27 కిలోమీటర్ల కారిడార్ ఉండగా, దశలవారీగా మెట్రో రైలు పనులు చేపట్టారు. నాగోల్ నుంచి అమీర్‌పేట్ వరకు 17 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని 2017 నవంబర్ నెలలోనే ప్రారంభించారు. మిగిలిన 10 కిలోమీటర్ల మార్గం (అమీర్‌పేట్-హైటెక్ సిటీ) ఇప్పుడు ప్రారంభం కానుంది.

నిజానికి ఈ మార్గంలో మెట్రో రైలు ప్రారంభానికి.. ఆస్తుల సేకరణ, కోర్టు కేసులు అడ్డుపడ్డాయి. అందుకే తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఎట్టకేలకు ఒక్కోటి పూర్తి చేసుకుంటూ వచ్చిన అధికారులు సీఎంఆర్ఎస్ అనుమతి కూడా రావడంతో ఇక ఆలస్యం చేయకుండా ఈ మార్గంలో మెట్రో రైలును ప్రారంభించాలని నిర్ణయించారు.

hyderabad-merto-rail-routesఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో…

అయితే ఈలోపే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడం, ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మెట్రో రైలు ప్రారంభం విషయంలో అధికారులు ప్రభుత్వాన్ని సంప్రదించారు. చివరికి గవర్నర్‌తో ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి అమీర్‌పేట్-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలును ప్రారంభించాలంటూ గవర్నర్ నరసింహన్‌ను కోరగా అందుకు ఆయన అంగీకరించారు.

ప్రతి 9-12 నిమిషాలకు ఒక రైలు…

నగరంలోని అన్ని మెట్రో కారిడార్లలో ప్రతి 6 నిమిషాలకు ఒక మెట్రో రైలు తిరుగుతుండగా.. అమీర్‌పేట్-హైటెక్ సిటీ మార్గంలో మాత్రం ప్రతి 9-12 నిమిషాల మధ్య ఒక మెట్రో రైలు తిరగనుంది. ఎందుకంటే హైటెక్ సిటీ స్టేషన్ తర్వాత మెట్రో రైలు ట్రాక్ మారేందుకు చేపట్టిన రివర్సల్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ పనులు పూర్తి అవడానికి మరికొన్ని నెలలు పడుతుంది.

అప్పటి వరకు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి హైటెక్ సిటీ వరకు.. రైల్వేలో మాదిరిగా ట్విన్ సింగిల్ లేన్ విధానంలో మెట్రో రైళ్లను నడుపనున్నారు. ఈ ఐదు కిలోమీటర్ల మార్గంలో.. రెండు ట్రాక్‌లపై వెళ్లిన మెట్రో రైళ్లు తిరిగి అవే ట్రాక్‌లపై వెనక్కి తిరిగి వస్తాయి. పైగా కొత్తమార్గం, ఎక్కువ మలుపులు ఉండటంతో సీఎంఆర్‌ఎస్‌ వేగనియంత్రణ విధించింది. ఫలితంగా మిగతా మార్గాలతో పోల్చితే, ఈ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకల్లో కొంత ఆలస్యం చోటుచేసుకుంటుంది.

ఆ మూడు స్టేషన్లూ తర్వాత…

అమీర్‌పేట్-హైటెక్ సిటీ మెట్రో రైలు మార్గంలో మొత్తం 9 స్టేషన్లు తగులుతాయి. అమీర్‌పేటతో పాటు మధురానగర్‌, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబరు-5, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్‌, దుర్గంచెరువు, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో ఈ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్‌ స్టేషన్ల ప్రారంభానికి కూడా మరికొంత కాలం పడుతుంది.

ప్రత్యేకతలు…

అమీర్‌పేట్-హైటెక్ సిటీ మెట్రో రైలు మార్గంలో మధురానగర్‌ స్టేషన్‌ను పూర్తిగా మహిళల కోసం కేటాయించారు. దీనికి తరుణి స్టేషన్‌గా నామకరణం చేశారు. ఇక్కడ రెండెకరాల స్థలంలో మహిళలు, పిల్లల అవసరాలు తీర్చే దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు.

నగరంలోని మెట్రో స్టేషన్లన్నీ రెండు అంతస్తుల్లో ఉండగా.. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు స్టేషన్‌ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఒకే అంతస్తులో నిర్మించారు. ఇక్కడ ఫ్లాట్‌ఫాం, కాన్‌కోర్స్‌ రెండూ ఒకే అంతస్తులో ఉన్నాయి.

నాగోల్ నుంచి హైటెక్ సిటీకి వచ్చే ప్రయాణికులు మధ్యలో అమీర్‌పేట్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌లో దిగి హైటెక్ సిటీ వైపు వెళ్లే మెట్రో రైలు ఎక్కాల్సి ఉంటుంది. ఇక జేబీఎస్ నుంచి ఇమ్లీబన్ (10 కిలోమీటర్లు) వరకు మెట్రో రైలు మార్గం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా.. ఇమ్లీబన్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో (6 కిలోమీటర్లు) పనులు మొదలే కాలేదు.