హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం! బైక్ పై వెళ్తున్నవ్యక్తి దుర్మరణం!

12:16 pm, Thu, 18 April 19
accident

తెలంగాణ: తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తిని అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో అమాంతం గాల్లోకి ఎగిరిపడ్డ వాహనచోదకుడు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ప్రమాదం నేపథ్యంలో ఉప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో రామంతపూర్ కు చెందిన హరినాయక్ ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.

హరినాయక్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు జనగామ డిపోకు చెందినదని పేర్కొన్నారు. బస్సు అతివేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.