5వ తేదీ అర్థరాత్రి వరకే గడువు, దాటిందో ఇక అంతే..: ఆర్టీసీ సమ్మెపై తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్

11:48 pm, Mon, 4 November 19
telangana-chief-minister-kcr-review-meeting-on-tsrtc-strike

హైదరాబాద్: మంగళవారం (5వ తేదీ) అర్థరాత్రిలోగా విధులకు హాజరుకాని ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల్లో చేర్చుకోరాదంటూ సీఎం కేసీఆర్ అధికారులకు అదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ కార్మికులకు విధించిన డెడ్‌లైన్ అంశంపై సోమవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇక ఉద్యోగాలు కాపాడుకోవడం అనేది పూర్తిగా ఆర్టీసీ కార్మికుల చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. తాము విధించిన డెడ్‌లైన్ దాటిన తరువాత ఏ ఒక్క కార్మికుడిని ఉద్యోగాల్లోకి తీసుకోబోమని, ఒకవేళ ఆర్టీసీ కార్మికులు గతంలో మాదిరిగానే మొండి వైఖరి అవలంభిస్తే.. ఇక తెలంగాణలో ఆర్టీసీ అనేది ఉండదని కేసీఆర్ తేల్చిచెప్పారు.

అంతేకాదు, ఒకవేళ అదే గనక జరిగితే అందుకు కారణం.. ముమ్మాటికీ కార్మికులేనని, యూనియన్ నాయకులే కార్మికులను మభ్యపెడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు.

గడవులోగా విధులకు హాజరుకాకుంటే…

ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని ఇప్పటికే కార్మిక శాఖ నివేదిక ఇచ్చిందని చెప్పిన సీఎం కేసీఆర్.. గడువులోగా కార్మికులు విధులకు హాజరుకాకుంటే.. మిగిలిన 5 వేల రూట్లలో కూడా ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు.

ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చే పరిస్థితిలో హైకోర్టు లేదంటూ.. ఒకవేళ హైకోర్టు తీర్పు మరోలా ఉంటే.. తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు.

అదే గనుక జరిగితే ఆర్టీసీ సమ్మె సమస్య ఇప్పట్లో పరిష్కారం దొరకదని, అదొక అంతులేని పోరాటం అవుతుందని వ్యాఖ్యానించారు. యూనియన్ల మాయలో పడి కుటుంబాలను చెడగొట్టుకోరాదని, 5వ తేదీలోపు బేషరతుగా విధులకు హాజరై ఉద్యోగాలు కాపాడుకోవాలంటూ కార్మికులకు హితవు పలికారు.