వన్స్‌మోర్: ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం, స్పీకర్ ఎన్నికపై దృష్టి, అసెంబ్లీ తొలిరోజున…

kcr-oath-in-assembly-1
- Advertisement -

kcr-oath-in-assembly

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ గురువారం కొలువుదీరింది. తొలి సమావేశం ఉదయం 11.30 గంటలకు మొదలైంది. ప్రొటెం(తాత్కాలిక) స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన ప్రారంభమైన తొలిరోజు సమావేశంలో ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

మొదట సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయగా, ఆ తరువాత మహిళా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. అక్షర క్రమంలో మొదటగా ఉన్నా ఖానాపూర్‌ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌, తర్వాత కాంగ్రెస్‌ ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రమాణం చేశారు. ఆ తరువాత ఆరుగురు మహిళా సభ్యుల ప్రమాణం చేశారు.

చదవండి: ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు: కొండా రాజీనామా

రేఖానాయక్, బానోతు హరిప్రియ నాయక్ ఇంగ్లీష్‌లో ప్రమాణం చేయగా, మిగిలిన వారు తెలుగులోనే ప్రమాణం చేశారు. ఆ తరువాత పురుష ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని తాత్కాలిక స్పీకర్ ప్రారంభించారు.

మొదటగా ఆలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం ప్రమాణ స్వీకారం చేశారు. చివరగా వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జూబ్లీహాలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొంటారు.

తొలిరోజు షెడ్యూల్ ఇదే…

ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పీకర్ ఎంపిక కోసం నామినేషన్‌ దాఖలు ప్రక్రియ ఉంటుంది. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలతో కలిసి గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. 11.20 గంటలకు ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభకు చేరుకుంటారు.

11.30కి ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ అధ్యక్షతన శాసనసభా సమావేశం ప్రారంభం అవుతుంది.. వరుసగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు.

స్పీకర్ ఎన్నికపై దృష్టి…

తెలంగాణ శాసనసభాపతిగా సీనియర్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ కూడా మద్దతు తెలిపింది. దీంతో స్పీకర్‌‌గా పోచారం ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నేపథ్యంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి గురువారం తొలిరోజు అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. మరికాసేపట్లో పోచారం తెలంగాణ శాసనసభాపతి పదవికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

చదవండి: ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణం, ఇక అసెంబ్లీ సమావేశాలు షురూ…

చదవండి: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా ఆయనే, దాదాపుగా ఖరారు! ఆయనవైపే సీఎం కేసీఆర్ మొగ్గు?

 

- Advertisement -