హైదరాబాద్: కొవిడ్ మహమ్మారికి తెలంగాణకు చెందిన మాజీ మంత్రి మాతంగి నర్సయ్య కన్నుమూశారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గత 20 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.
కరోనాకు తోడు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తోడవడంతో ఆయన ఆరోగ్యం విషమించింది. నర్సయ్య భార్య బోజమ్మ కూడా 15 రోజుల క్రితం కరోనా కారణంగా చనిపోయారు.
రెండు వారాల వ్యవధిలోనే దంపతులిద్దరూ కన్నుమూయడంతో వారింట్లో విషాదం నెలకొంది. నర్సయ్య మృతికి పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నర్సయ్య మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గత నెల 8న మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య కూడా కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.