హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్!? రైళ్లు, విమానాలు బంద్.. నిత్యావసరాల కోసం రోజూ 2 గంటల సడలింపు?

cm-kcr-thinks-to-reimpose-lockdown-in-hyderabad
- Advertisement -

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో కరోనా కట్టడి కోసం మళ్లీ లాక్‌డౌన్ విధించాలనే యోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 

కనీసం 15 రోజులపాటు తిరిగి లాక్‌డౌన్ విధించాలంటూ వైద్య వర్గాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, దీనిపై రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. 

- Advertisement -

కరోనా వైరస్ కట్టడి చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తు వ్యూహం తదితర అంశాలపై ఆదివారం ప్రగతిభవన్‌లో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. 

ఒకవేళ జీహెచ్ఎంసీ పరిధిలో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించుకుంటే.. అనేక అంశాలు తాము పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. 

ఈసారి లాక్‌డౌన్ పెడితే నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ఒకటి రెండు గంటలు మాత్రమే సడలింపు ఇచ్చి మిగిలిన రోజంతా కర్ఫ్యూ విధించాల్సి ఉంటుందని, లాక్‌డౌన్‌ను ఈ స్థాయిలో సంపూర్ణంగా, కట్టుదిట్టంగా అమలు చేస్తే తప్ప ప్రయోజనం ఉండదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

బస్సులు, రైళ్లు, విమానల రాకపోకలు కూడా నిలిపివేయాల్సి ఉంటుందని, ప్రభుత్వ పరంగా అన్నీ సిద్ధం చేయాల్సి ఉంటుందని, అన్ని అంశాలను లోతుగా పరిశీలించి రెండు మూడు రోజుల్లో సరైన వ్యూహాన్ని ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. 

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంపై భయపడాల్సిన అవసరం లేదని, బాధితులందరికీ సరైన వైద్య చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేసీఆర్ చెప్పారు. 

లాక్‌డౌన్ అనేది ఆషామాషీ నిర్ణయం కాదని, అది చాలా పెద్ద నిర్ణయమని, ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని, అటు ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుందని, ముఖ్యంగా పోలీసు యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. 

రెండ్రోజులపాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి, అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుందని, అవసరమైతే మూణ్ణాలుగు రోజుల్లో కేబినెట్‌ను సమావేశపరిచి లాక్‌డౌన్ విధింపుపై ఒక నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు.

అంతకుముందు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వివరించారు. కరోనా వ్యాప్తి దేశ వ్యాప్తంగా జరుగుతోందని, తెలంగాణలోనూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.

పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారికి అవసరమైన అన్ని వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోనూ వేల బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. 

తీవ్రత తక్కువ ఉన్నవారికి ఇళ్లలోనే చికిత్స అందిస్తున్నామని, తీవ్రత ఎక్కువ ఉన్న వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 

జాతీయ సగటుతో పోల్చితే తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య తక్కువేనన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు

 

 

- Advertisement -