కేసీఆర్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై

- Advertisement -

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాతో గవర్నర్ మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో టీఆర్ఎస్ ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కరోనా ఉద్ధృతిని అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కరోనాను కట్టడి చేయడంలో ఎక్కువ టెస్టులు చేయడమే ముఖ్యమని అన్నారు.

- Advertisement -

మొబైల్ టెస్టింగులు చేయాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. కరోనా కట్టడిపై ఇప్పటికే ప్రభుత్వానికి ఐదారు లేఖలు రాశామని, అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు.

కరోనాను కట్టడి చేయాల్సిన ప్రాంతాల్లో సైతం ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని గవర్నర్ అన్నారు.

ఐసీఎంఆర్ నిబంధనల మేరకు పరీక్షలు చేస్తున్నామంటూ ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం సరైన సదుపాయాలు లేవని, అందుకే కరోనా బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారని అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా, ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. సీఎం కేసీఆర్ తనను కలిసినప్పుడు ఈ విషయాలను ఆయనకు గట్టిగానే చెప్పానని గవర్నర్ పేర్కొన్నారు.

- Advertisement -