ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. సోమవారం నుంచే అమలు

4:56 pm, Sat, 20 June 20
cm-kcr-telangana-cabinet-meeting

హైదరాబాద్: కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు మార్గదర్శకాలు జారీ చేసింది. 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు కావాలని సూచించింది. ఒక వారం సగం మంది విధులకు హాజరైతే మరో వారం మిగతా సగం మంది డ్యూటీలో పాల్గొనాలని సూచించింది.

సోమవారం నుంచి జూలై 4వరకు ఈ మార్గదర్శకాలను పాటించాలని ఉద్యోగులను ఆదేశించింది. అనారోగ్య సమస్యలు ఉన్న వారు సెలవులు పెట్టుకోవాలని ఆదేశించింది. లిఫ్ట్‌లో ముగ్గురి కంటే ఎక్కువ మంది వెళ్లొద్దని ఆదేశించింది. ఏసీలు వాడకపోవడం మంచిదని సలహా ఇచ్చింది.

అనారోగ్య సమస్యలు ఉన్న వారు లిఫ్టులు వాడితే ఉత్తమమని పేర్కొంది. అధికారుల డ్రైవర్లు పార్కింగ్ ఏరియాలో కాకుండా పేషీలో ఉండాలని సూచించింది. తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే 499 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కరోనా బారిన పడ్డారు.

జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. ఖైరతాబాద్ జోనల్ కమిషర్‌కు కూడా ఇన్ఫెక్షన్ సోకింది. పోలీసులు, వైద్యసిబ్బంది, జర్నలిస్టులపైనా కోవిడ్ పంజా విసురుతోంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 190 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు.