తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్

10:17 am, Tue, 21 January 20

హైదరాబాద్: రబీ రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రబీలో రైతులకు పెట్టుబడి సాయం కింద నగదును అందించేందుకు రూ.5,100 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే ఈ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

2019-20 వార్షిక బడ్జెట్‌లో రైతు బంధు పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.12,862 కోట్లు కేటాయించింది. ఖరీఫ్ సీజన్‌లో పెట్టుబడి సాయం కింద ఇందులోంచి రూ.6,862 కోట్లు విడుదల చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు రబీ సీజన్‌ కోసం మరికొన్ని నిధులను మంజూరు చేస్తూ పాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారుల వివరాలు ఆర్థిక శాఖకు అందిన వెంటనే ఆ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతుంది.