తక్కువ లక్షణాలుంటే ఇక ఇంట్లోనే చికిత్స.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

10:21 pm, Sun, 7 June 20

హైదరాబాద్: కరోనా రోగుల చికిత్స విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షణాలు తక్కువ ఉన్న రోగులు ఇకపై ఇంట్లోనే చికిత్స చేయించుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. 

కరోనా బాధితులకు జిల్లాల్లోనే చికిత్స, జిల్లా కేంద్రాల్లో ఐసోలేషన్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. హోంక్వారంటైన్‌లో ఉండేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా ప్రజల్లో ఉన్న భయం వారిని ఆస్పత్రి నుంచి బయటికి రానివ్వడం లేదన్నారు.

ఇంట్లో ప్రత్యేక గది లేనివారు ఆస్పత్రిలోనే ఉండాలని కోరుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఆస్పత్రుల మీద భారం పెరుగుతోందని మంత్రి పేర్కొన్నారు.

క్వారంటైన్‌లో ఉండేందుకు ఇంటిపక్కన ఉన్నవారు సహకరించాలని మంత్రి ఈటల కోరారు. జీవనోపాధి కోల్పోకూడదనే ఉద్దేశంతో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తున్నట్టు చెప్పారు.

అవసరంలేకున్నా బయటికి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రజలకు హితవుపలికారు. ప్రజలు ఎక్కువ మందికి బయటికి రావడంతో వైరస్‌ వ్యాప్తి పెరిగిందన్నారు.

వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కరోనా సోకితే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి చికిత్స చేయాలని ఈటల రాజేందర్ సూచించారు.