31న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకి ఉపఎన్నిక…టీఆర్ఎస్ అభ్యర్ధులు ఖరారు?

8:02 am, Tue, 7 May 19

హైదరాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల కోటాలో ఎంపికైన ముగ్గురు ఎమ్మెల్సీల రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 31న ఉపఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో  పట్నం నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి.

అలాగే గత డిసెంబర్ లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో కొండా మురళీ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ మేరకు ఖాళీ అయిన రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.

చదవండి: ఇండియా టుడే సర్వేలో ఏపీ నుండి టాప్ లో జగన్! బాబు నంబర్ ఎంతో…

ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. మే 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ, 15న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 17 కాగా, మే 31న పోలింగ్ జరగనుంది. జూన్ 3న ఓట్ల లెక్కింపు జరగనున్నట్టు సమాచారం.

మూడు స్థానాలకి తెరాస అభ్యర్ధులు ఖరారు?

ఇక స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తయింది. రంగారెడ్డి స్థానం నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి,  వరంగల్‌ స్థానంలో టీఆర్ఎస్ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ నుంచి ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డిలను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు సమాచారం.

చదవండి:మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్ ప్రయత్నాలు….