వ్యాపారి బర్త్‌డే పార్టీకి హాజరైన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు.. కరోనాతో కన్నుమూసిన వ్యాపారి!

12:28 pm, Sun, 5 July 20

హైదరాబాద్: నగరానికి చెందిన ఓ బంగారు వ్యాపారి ఇచ్చిన పార్టీకి ఏకంగా ఇద్దరు మంత్రులు హాజరు కావడం, ఆ తర్వాత కరోనాతో వ్యాపారి మరణించడంతో ఇప్పుడు వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హిమాయత్‌నగర్‌లో నివసించే ఓ బంగారు వ్యాపారి పుట్టిన రోజు వేడుకలు గత నెల 22న ఘనంగా జరిగాయి.

ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు బంగారు వర్తకులు కలిసి మొత్తం 150 మందికిపైగా ఈ వేడుకకు హాజరయ్యారు. పార్టీ జరిగిన రెండు రోజుల తర్వాత వ్యాపారి అస్వస్థతకు గురయ్యాడు. దగ్గు, ఆయాసంతో బాధపడుతుండడంతో ఓ ఆసుపత్రికి వెళ్లాడు.

అనుమానించిన వైద్యులు మందులు రాసిస్తూనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మందులు వాడుతున్నా దగ్గు, ఆయాసం తగ్గకపోవడంతో అనుమానించిన వ్యాపారి ఐదు రోజుల క్రితం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే, పరిస్థితి అప్పటికే విషమించడంతో ఆ మరుసటి రోజే అతడు మరణించాడు.

ఆ తర్వాత ఐదు రోజులకే ఈ పార్టీలో పాల్గొన్న జువెలరీ అసోసియేషన్ ప్రతినిధి కూడా ఐదు రోజుల క్రితం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీనికి తోడు పార్టీకి హాజరైన వారిలో 20 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

ఈ వేడుకకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పుడీ విషయం తెలిసి వణికిపోతున్నారు. దీంతో వీరంతా రహస్యంగా కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు తెలుస్తోంది.