అధికార టీఆర్ఎస్‌కు షాక్: ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి జయకేతనం

7:12 pm, Tue, 26 March 19
narsireddy

హైదరాబాద్‌‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. వరంగల్‌ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన తెలంగాణ పీఆర్టీయూ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఆయనపై తెలంగాణ యూటీఎఫ్‌ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయం సాధించారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 18,885 ఓట్లు పోలవ్వగా నర్సిరెడ్డికి 8976 ఓట్లు, పూల రవీందర్‌కు 6,279 ఓట్లు వచ్చాయి. అయితే, ఫలితాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల సంఘం అనుమతి వచ్చాకే నర్సిరెడ్డి గెలుపుపై ప్రకటన చేయనున్నారు.

గత ఎన్నికల్లో పూల రవీందర్‌ టీఆర్ఎస్ అభ్యర్థి వరదారెడ్డిపై విజయం సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో రవీందర్‌కు ఉన్నత విద్య జూనియర్‌ కళాశాల అధ్యాపక, ప్రిన్సిపల్‌ సంఘాలతో పాటు కాంట్రాక్టు లెక్చరర్లు మద్దతు ప్రకటించడంతో విజయం ఖాయమని అంతా భావించినా అనూహ్య ఫలితాలతో అంచనాలు తలకిందులయ్యాయి.

టీఆర్ఎస్ తొత్తుగా ఉండను

ఈ సందర్భంగా అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఇది రాష్ట్రంలోని అధ్యాపకుల గెలుపని చెప్పారు. తన కోసం గత ఆరు నెలలుగా శ్రమించిన ప్రతి కార్యకర్తకూ ఈ గెలుపును అంకితం చేస్తున్నానని తెలిపారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ ధ్వంసమైందని.. దాని పునర్నిర్మాణానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

అక్షరాస్యతలో తెలంగాణ వెనుకబడి ఉందని… విద్య ప్రైవేటీకరణలో మాత్రం దేశంలోనే ముందు స్థానంలో ఉందని విమర్శించారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా బడ్జెట్ లో కేటాయింపులు జరపాలని అన్నారు.ప్రభుత్వానికి తొత్తుగా ఉండనని నర్సిరెడ్డి తేల్చి చెప్పారు.

చదవండి: అందుకే మహేశ్ బాబుపై ఐటీ దాడులు: గల్లా సంచలనం