ఇంటర్ బోర్డు వద్ద ఉద్రికత్త! విద్యార్థుల ధర్నాలు! కార్యాలయం చుట్టూ పటిష్ట భద్రత!

1:24 pm, Tue, 23 April 19
Telangana Latest News, Inter Board Latest News, Inter Result News, Newsxpressonline

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇంటర్ బోర్డు తప్పుల వల్ల విద్యార్థులు బలవుతున్నారంటూ పలు స్టూడెంట్ యూనియన్లు బోర్డు ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతోపాటు బోర్డు చేసిన తప్పుల వల్ల నష్టపోయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకుంటున్నారు.

దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. వచ్చిన వారిని వచ్చినట్టు వెనక్కి పంపేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద భారీగా బ్యారికేడ్లు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలపై విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డితో తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషీ సమీక్ష నిర్వహించారు.

ఈనెల 18న విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలను చూసి విద్యార్థులు షాక్ తిన్నారు. మెరిట్ స్టూడెంట్స్‌కు కూడా తక్కువ మార్కులు రావడం, ఏకంగా జిల్లా టాపర్‌కు తెలుగులో సున్నా మార్కులు రావడం చూసి కంగుతున్నారు. ఈ క్రమంలో ఇంటర్ బోర్డులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, తమ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు 16 మందికి పైగా ఇంటర్ మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంటర్ బోర్డులో జరిగిన తప్పులపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈనెల 21న మంత్రి జగదీష్ రెడ్డి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో హైదరాబాద్ ఐఐటీ, బిట్స్ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్లను సభ్యులుగా నియమించారు.

ఇంటర్ బోర్డులో జరిగిన తప్పులపై నివేదిక ఇవ్వడానికి ఈ కమిటీకి మూడు రోజుల గడువు ఇచ్చారు. ఆ గడువు ఈనెల 24తో ముగుస్తుంది. విద్యార్థులకు స్టూడెంట్ యూనియన్లు, రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఈనెల 22న టీ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, రేవంత్ రెడ్డి ధర్నా చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

చదవండి: శ్రీలంకలో పండుగపూట మారణహోమం….ఇది ఎవరి పని?