టీఆర్ఎస్‌కు షాక్! బీజేపీలో చేరిన ఎంపీ జితేందర్ రెడ్డి…

11:38 pm, Wed, 27 March 19
jitendar reddy joined in bjp

న్యూఢిల్లీ: టీఆర్ఎస్ నేత, మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి ఎట్టకేలకు తన సొంత గూటికి చేరారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధిష్ఠానం ఎంపీ టిక్కెట్ కేటాయించకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని వీడి బీజేపీలో చేరారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో జితేందర్ రెడ్డి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అమిత్ షా ఆయన్ని సాదరంగా తమ పార్టీలోకి ఆహ్వానించారు.

1999లో జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆయన, ఆ పార్టీని కూడా వీడి టీఆర్ఎస్ లో చేరారు. 2014లో మహబూబ్ నగర్ నుంచి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం జితేందర్ రెడ్డికి దక్కకపోవడంతో తిరిగి బీజేపీలో చేరిపోయారు. ఆయన బీజేపీలో చేరడంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.