హైదరాబాద్‌లో మాల్స్ మినహా అన్ని షాపులూ ఓపెన్.. అనుమతి ఇచ్చేసిన సీఎం కేసీఆర్

2:20 am, Thu, 28 May 20
ts-government-permits-to-open-all-shops-in-hyderabad-except-shopping-malls

హైదరాబాద్: భాగ్యనగర వాసులకు శుభవార్త! గురువారం నుంచి హైదరాబాద్‌లో అన్ని రకాల దుకాణాలు ఓపెన్ కానున్నాయి.. ఒక్క షాపింగ్ మాల్స్ తప్ప. 

బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులతోపాటు అధికారులు కూడా పాల్గొన్నారు.

కరోనా లాక్‌డౌన్ కారణంగా నెలల తరబడి అన్నీ మూతపడడంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన ఆదాయంలో భారీగా గండి పడినట్లయింది. దీంతో మెల్లమెల్లగా ఒక్కక్కటీ ఓపెన్ చేస్తున్నారు. 

ప్రస్తుతం నగరంలో షాపులను సరి, బేసి పద్ధతిలో తెరుస్తున్నారు. దీంతో రోజూ సగం షాపులు మూతపడే ఉంటున్నాయి. ఫలితంగా ఆయా షాపుల్లో రద్దీ అధికం అవుతోంది. 

సీఎం సమీక్ష సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. ఎక్కువ షాపులు తెరవడం వల్ల వాటి వద్ద రద్దీ కూడా తక్కువగా ఉంటుందని కేసీఆర్ భావించారు.

దీంతో గురువారం నుంచి హైదరాబాద్‌లో అన్ని దుకాణాలు తెరిపించాలంటూ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 

అయితే షాపుల యజమానులు, వినియోగదారులు అందరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం తెలిపింది.

షాపులకే కాకుండా, నగరంలో అన్ని రకాల ట్యాక్సీలు, ఆటోలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే నగరంలో సిటీ బస్సుల రాకపోకలపై మాత్రం నిషేధం అమలు అవుతుంది.

సిటీ బస్సులను ఎప్పటి నుంచి అనుమతించాలనే విషయంపై త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.