బయటపడ్డ ఇంటర్ బోర్డు మరో వైఫల్యం: 17 మార్కులకే పాస్!

10:53 am, Wed, 24 April 19
ts inter

తెలంగాణ: ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో బోర్డు నిర్లక్ష్య వైఖరి 17మంది ప్రాణాలను బలిగొన్నది. పరీక్షలు బాగా రాసినప్పటికీ.. ఫలితాల్లో ఫెయిలైనట్టు రావడంతో మనస్తాపం చెందిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

ఆయా సబ్జెక్టుల్లో టాపర్స్‌గా నిలిచినవారికి సైతం కొన్ని సబ్జెక్టుల్లో సున్నా మార్కులు రావడం.. ఫెయిల్ అయినట్టు ఫలితాలు రావడంతో పేపర్ వాల్యుయేషన్‌, ఇంటర్ బోర్డు ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌పై అనుమానాలు తలెత్తాయి.

దీంతో ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి సంబంధించి మరో తప్పిదం బయటపడింది. 17 మార్కులు మాత్రమే సాధించిన విద్యార్థి పాసైనట్టుగా ఫలితాల్లో ఇంటర్ బోర్డు వెల్లడించింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సాత్విక్ అనే విద్యార్థికి ఇంటర్ మొదటి సంవత్సరం గణితం 1(A)లో ఈ మార్కులు వచ్చాయి. పాస్ మార్కులు 27 అయితే 17 మార్కులకే పాసైనట్టు వెల్లడించడం గమనార్హం. ఈ ఘటనతో ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.