ఆర్టీసీ సమ్మె: సీఎం కేసీఆర్‌పై జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు…

4:33 pm, Mon, 7 October 19
ksrtc-jac-convenor-ashwathama-reddy

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ కఠిన వైఖరి అవలంబించడంపై జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఈయూ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్నుపడిందని, సంస్థకు చెందిన రూ.60 వేల కోట్ల స్థిరాస్తులను సొంతం చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అంతేకాదు, ఆర్టీసీ సమ్మె న్యాయబద్ధమైనదేనని న్యాయ నిపుణులు కూడా చెప్పారని,  కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. అసలు ఆర్టీసీ సమ్మె తీవ్రం కావడానికి కేసీఆర్ నిరంకుశ ధోరణి కారణమని ఆయన అన్నారు. 

విలీనం మేనిఫెస్టోలోనే లేదనడం విడ్డూరం…

సమ్మెపై ఆదివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో కూడా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ విలీన అంశం టీఆర్ఎస్ మేనిఫెస్టోలో లేదని చెప్పడం విడ్డూరమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన శక్తులను నిర్మూలించేందుకు కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. 

తాము కేసీఆర్ ఫాంహౌస్‌లో పనిచేస్తోన్న పాలేర్లం కాదని, ఆయన బెదిరింపులకు భయపడే సమస్యే లేదని అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యమాలతో సీఎం కుర్చీలో కూర్చున్న కేసీఆర్ నేడు ఉద్యమాలనే అణిచివేసే కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. 

ఏపీలో విలీనం జరగలేదా?

ఇతర రాష్ట్రాల ఆర్టీసీలతో టీఎస్సార్టీసీని పోల్చరాదని, ఏపీఎస్సార్టీసీతో పోల్చాలని ప్రభుత్వానికి సూచించారు. ఏపీలో సీఎం జగన్ అక్కడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని, ఆ తరువాతే తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ మొదలైందని, విలీనం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.